జనవరి 1 న భీమా కోరేగాం యుద్ధం 202వ వార్షికోత్సవం కావడంతో మిలింద్ ఎక్బోటే, శంభాజీ బీడేలతో సహా 160 మంది హిందూత్వ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2018 లో భీమా కోరేగామ్ యుద్ధం జరిగి 2 శతాబ్దాలైన సందర్భంగా హింస చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అల్లర్లకు తమ కార్యకర్తలను రెచ్చగొట్టారంటూ హిందూత్వ సంఘాల నేతలైన మిలింద్ ఎక్బొటే, శంభాజీ బీడేలపై కేసు నమోదైంది. దీంతో ఈసారి అలా జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మిలింద్ ఎక్బేటే, శంభాజీ బిడేలు భీమ కోరేగాం లోకి ప్రవేశించకుండా నోటీసులిచ్చారు.
హరాష్ట్రలో పుణెకు సమీపంలోని భీమా కోరేగాం దగ్గరున్న విజయస్థూపానికి(జయ్ స్తంభ్) ప్రతి ఏటా జనవరి 1న లక్షలాది మంది దళితులు వచ్చి నివాళులర్పిస్తారు. దీని కోసం జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
202 సంవత్సరాల క్రితం ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనికులుగా ఉన్నదళితులైన మహర్లు బ్రాహ్మణులైన పీష్వాలను ఓడించారు. దీనికి గుర్తుగా భీమా కోరెగాం లో విజయ్ స్థూపాన్ని నిర్మించారు. ప్రతి ఏటా లక్షలాది మంది దళితులు ఈ విజయ స్థూపాన్ని సందర్శించుకొని నివాళులర్పించడం ఆనవాయితీ. 2018 లో జనవరిలో కోరేగామ్ లో దళితుల ఈ ఉత్సవానికి వ్యతిరేకంగా హిందూత్వ సంఘాలు పోటీ ర్యాలీని నిర్వహించాయి. దీంతో హిందూత్వ సంఘాలకు, దళితులకు మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో ఓ వ్యక్తి చనిపోయాడు.