వివాహితను గన్ తో బెదిరించి అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు, సాంకేతిక ఆధారాలను సరిపోల్చిన వనస్థలిపురం పోలీసులు ఆయనను ఎల్బీనగర్ ఎస్‌వోటీ కార్యాలయంలో విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. సోమవారం రిమాండ్ కు తరలించనున్నారు.
ఈ నెల 6న బాధితురాలి భర్త కర్రతో దాడి చేయడంతో నాగేశ్వరరావు భుజానికి గాయమైందని తెలిపారు పోలీసులు. చికిత్స అనంతరం అదుపులోకి తీసుకున్నామని ఎస్‌వోటీ పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని, ఆమె భర్తను ఈనెల 7న కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకు వస్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకు వాడిన కారును కూడా వనస్థలిపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
Advertisements
తన భర్తపై దాడి చేసి.. తనను గన్ తో బెదిరించి ఇన్ స్పెక్టర్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు సీఐపై కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. అత్యాచారం, ఆయుధ చట్టం కింద నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.