రాజకీయం చెయ్యటం చేతకాకపోతే మూలాన కూర్చోవాలంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత. నర్సీపట్నంలో బందోబస్తులో ఉన్న పోలీసులను అయ్యన్న పాత్రుడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ దుర్భాషలాడినట్టు ఆమె దృష్టికి రావడంతో పోలీసు సంఘం ఆధ్వర్యంలో ఆమె స్పందించి అయ్యన పాత్రుడి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
పోలీసులకు ఎవరిపైన ప్రేమ అభిమానాలు ఉండవు. చట్టం ప్రకారం విధులను నిర్వహిస్తామని తెలిపారు. ఇంట్లో మూలన కూర్చోవాలని పోలీసులను విమర్శించే హక్కు ఆయనకు లేదన్నారు. ఖాకీ దుస్తులు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని ఆయన అనడం వింతగా ఉందన్నారు స్వర్ణలత.
తాము ఖాకీ దుస్తులు తీసి రాజకీయాలకు వస్తే అయ్యన్నకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అయ్యన్న రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయిందని చెప్పుకొచ్చారు. దేశంలో అత్యుత్తమంగా పనిచేస్తున్న ఏపీ పోలీసు వ్యవస్థపై ఇష్టాను సారంగా వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు.