గ్రామపంచాయతీల నిధుల విషయంలో కాంగ్రెస్ పోరుబాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు ఏర్పాట్లు చేసింది. కానీ, పోలీసులు కాంగ్రెస్ నేతల్ని ఇళ్లు దాటనీయడం లేదు. ఎక్కడికక్కడే అందర్నీ హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కీలక నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. పోలీసులు, ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
అయితే.. ఇందిరాపార్క్ దగ్గరకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ధర్నా చౌక్ బయలుదేరగా.. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఏ నిబంధనలతో తమను అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ లో ధర్నా చేసుకునే హక్కు అందరికీ ఉందని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు.
ధర్నాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా? అని నిలదీశారు రేవంత్ రెడ్డి. సర్పంచుల నిధులను ప్రభుత్వం కాజేసిందని.. వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమను అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారని పోలీసులను నిలదీశారు. అయినా.. ఇళ్ల ముందుకు వచ్చి అరెస్టు చేయడం ఏంటని మండిపడ్డారు రేవంత్.
సర్పంచులకు తెలియకుండా రూ.35వేల కోట్లు దారి మళ్లించారన్న రేవంత్ రెడ్డి… 8ఏళ్లు పూర్తయినా అమరవీరుల స్థూపం పూర్తి కాలేదని ఆరోపించారు. రేవంత్ ను పోలీసులు బలవంతంగా జీపులోకి ఎక్కించుకొని అక్కడ్నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మరోవైపు రేవంత్ ఇంటికి వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.