పోలీసుల అత్యుత్సాహం ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. రోడ్లపై ఉన్న వారిని తరిమికొట్టడంతో ఓ యువకుడు కిందపడి ప్రాణాలు వదిలాడు. గ్రామస్థుల కథనం ప్రకారం ఆదోని మండలం పెద్దహరివాణానికి చెందిన వీరభద్రయ్యస్వామి బెంగళూరులో గౌండా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా ప్రభావంతో పనులు ఆగిపోవడంతో రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి పెద్దహరివాణానికి వచ్చాడు.
గురువారం రాత్రి గ్రామ శివారులో గ్రామస్థులతో కలిసి వీరభద్రయ్యస్వామి రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో పోలీసులు వారి వెంటపడి తరిమారు. వీరభద్రయ్యస్వామి ప్రమాదవశాత్తు కిందపడి రోడ్డుపై ఉన్న రాయికి తల కొట్టుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలిసి గ్రామస్థులంతా ఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల అత్యుత్సాహంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.