కర్ణాటకలోని బీదర్ లో ఓ స్కూల్ విద్యార్ధులను పోలీసులు విచారించారు. 6,7,8 తరగతులు చదివే వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. చదువు, ఆటలు, పాటలు తప్ప బయటి లోకం తెలియని వారు పోలీసులు వచ్చి ప్రశ్నలు వేస్తుంటే భయం భయంగా సమాధానాలిచ్చారు. నాలుగైదు గంటలు క్లాస్ బయటే ఉన్నారు. ఇంతకీ వాళ్లు చేసిన నేరమేంటో తెలుసా..?జనవరి 21న సీఏఏ కు వ్యతిరేకంగా స్కూల్లో డ్రామా వేశారు. డ్రామాలో కొన్ని వాక్యాలు అభ్యంతరకరంగా ఉండడంతో దేశద్రోహం కేసు నమోదైంది. స్కూల్ హెడ్ మిస్ట్రెస్, ఓ విద్యార్ధి తల్లి అరెస్టయ్యారు. విచారణలో భాగంగా డీఎస్పీ, కొంత మంది పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యార్ధులను విచారించారు. డ్రామా స్క్రిప్ట్ ఎవరు రాశారు..? మీ టీచర్ చెప్పిందా అలా చేయమని..? అంటూ పదే పదే ప్రశ్నించారు.సీఏఏకు వ్యతిరేకంగా వేసిన డ్రామాలో ఓ విద్యార్ది ”చెప్పులతో కొడతాం” అనే లైన్ చెప్పింది. అది వైరల్ కావడంతో పోలీసులు దేశద్రోహం, స్కూల్లో మత ప్రాతిపదికన శతృత్వం పెంచడం వంటి కేసులు నమోదు చేశారు.
విద్యార్ధులు వేసిన డ్రామాపై దేశద్రోహం కేసు పెట్టి తమను, పిల్లలను విచారణ పేరుతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు దేశద్రోహం కేసు పెట్టారో తెలియడు లేదని…ఒక విద్యార్ధి తల్లి క్షమాపణలు చెప్పిందని…వారు భయంతో బతుకుతున్నారని స్కూల్ సీఈవో తౌసిక్ మదికేరి చెప్పారు. విద్యార్ధి తల్లిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ వందలాది విద్యార్ధులు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. విద్యార్ధులను మాటి మాటికి విచారణ పేరుతో వేధించవద్దని లేఖలో కోరారు.