తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంక్రాంతి పండగను కనుల విందుగా జరుపుకుంటారు. తెలంగాణలో మహిళలు ముగ్గులు వేసి అందంగా రంగులద్ది ఆంనందంగా గడిపితే పురుషులు ఆటలపోటీలు నిర్వహించుకుంటారు. అటు ఆంధ్రాలో అయితే పండగకు ముందునుండే కోడిపందాలు జోరందుకుంటాయి. అయుతే.. ఈ ఏడాది పండగ సంబరాలు ముగిసినప్పటికీ.. కోడిపందాలు మాత్రం తగ్గలేదు. ఏపీలో పలు చోట్ల తగ్గేదే లే అన్నట్టుగా పందెపు రాయుళ్లు జోరు చూపెడుతున్నారు. రహస్య స్థావరాల్లో భారీ పెట్టుబడుల నడుమ కోడి పందాల జోరు సాగుతోంది.
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. కేసులు పెట్టి జైలుకు పంపినా జూదరులు మాత్రం వెనక్కి తగ్గకుండా పందాలు కాస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు వావిలోట పంచాయతీ నొచ్చుపల్లె సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారని డీఎస్పీ సుధాకర్ రెడ్డికి సమాచారం అందింది. ఆయన పాకాల సీఐ ఆశీర్వాదం, ఎస్సై మనోహర్ ను అప్రమత్తం చేసి.. కోడి పందాల స్థావరాలపై దాడి చేయించారు. పందాలు నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి నాలుగు కోళ్లు, రూ.90,747 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా.. నెల్లూరు జిల్లాలో దూబగుంట అడవుల్లో కోడి పందాల స్థావరాలపై దాడి చేశారు పోలీసులు. 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి 4 పందెం కోళ్లను, రూ.5500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి జూదాలకు పాల్పడుతూ 511 మందిని అరెస్టు చేసినట్లు పోలీసుల తెలిపారు. ముఖ్యంగా కోడి పందాలపై ప్రత్యేక నిఘా పెట్టి కోడి కత్తులు, పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Advertisements
కనుమ పండగ రోజే కాకినాడ, పెద్దాపురం, అమలాపురం, రామచంద్రాపురం, రంపచోడవరం డివిజన్ల పరిధిల్లో ఏకకాలంలో దాడులు చేసి 283 కోడి కత్తులు, 278 పందెం కోళ్లు స్వాధీనం చేసుకుని.. రూ.2,46,590 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా 221 కేసులు నమోదు చేసి.. 511 మందిని అరెస్టు చేసి.. ముగ్గుర్ని బైండోవర్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.