సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ట్రయల్ ను అడ్డుకుంటారనే ఉద్ధేశంతో ముందస్తుగా గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుమారు వందమంది భూ నిర్వాసితులను అరెస్ట్ చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
అరెస్టుతో పోలీసులు, భూ నిర్వాసితుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అర్ధరాత్రి ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భూనిర్వాసితులపై పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. పలువురు భూనిర్వాసితులకు గాయాలు అయ్యాయి. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు. ఊళ్లోకి మీడియాను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు.
అర్ధరాత్రి పోలీసులను ఇళ్లమీదికి పంపి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు భూనిర్వాసితులు. తమ సమస్యలను పరిష్కరించకపోగా.. తమపై దాడులు చేయించడం ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడ-మగ అని తేడా లేకుండా కొట్టించడం ప్రభుత్వానికి, అధికారులకు న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.
ఇక ఇదే ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతూ ట్వీట్ చేశారు. నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంతకాలం ప్రశ్నించిన వాళ్లను బంధించి పాలన సాగిస్తారని నిలదీశారు. భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.