హైదరాబాద్ లో బడా బాబుల ఆటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అడిగేవారు లేక ఇష్టా రాజ్యంగా అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. అందుకు అధికారులు, అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి ఆగడాలు సాగుతున్నాయంటున్నారు ప్రజలు.
తాజాగా.. నగరంలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో పేకాట డెన్ పై పోలీసుల దాడులు చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. రూ. 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు.
నగరంలోనే అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతాలలో అయితే ఎవరికి అనుమానం రాదనే దైర్యంతో డెన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. కానీ.. గుట్టు రట్టు అయ్యే సరికి అవాక్కయ్యారు. కొందరు ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడి చేసినట్టు డీసీపీ వెల్లడించారు.
వారిలో ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఎమ్మెల్యే కావడంతో అతన్ని వదిలేశారని.. మిగిలినవారిని అరెస్ట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు తప్పులు చేయడానికి.. కేసీఆర్ లైసెన్స్ లు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.