ఇల్లీగల్ దందాలకు నగర శివారుల్లోని అపార్ట్ మెంట్లు అడ్డాగా మారుతున్నాయి. టెర్రస్ గార్డెనింగ్, ప్లాట్స్ లోనే మొక్కల పెంపకం రూపంలో గంజాయి మొక్కలను పెంచుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సందట్లో సడేమియా అన్నట్టుగా గుట్టురట్టయ్యే వరకు వారి అక్రమ దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూనే ఉంటాయి. తాజాగా రాజేందర్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ ప్లాట్ రేస్ గుర్రం దందాలకు అడ్డుగా మారి కేటుగాళ్లు అడ్డంగా బుక్ అయ్యారు.
ఇక వివరాల్లోకి వెళితే..రాజేంద్రనగర్, తేజస్వీ నగర్ కాలనీ లోని ఓ ఇంటి పై దాడి చేసింది పోలీసుల బృందం. దీంతో ఆన్ లైన్ లో గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తుండగా 13 మంది పోలీసులకు రెడ్ హ్యాండెడ్ చిక్కారు. వారి వద్ద నుండి 51 వేల నగదు, 17 మొబైల్ ఫోన్లు, 19 డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, హార్స్ రేసింగ్ గైడ్ బుక్ తో పాటు ఓ కారు ను సీజ్ చేశారు పోలీసులు.
ఇక తేజస్వీ కాలనీ లోని ఓ అపార్ట్‌మెంట్ లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందుకు పోలీసులు అకస్మాత్తుగా నిర్వహించిన దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. అయితే పోలీసులను చూసి కేటుగాళ్లు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ దందాను నిర్వహిస్తున్న తిరుమల్ రెడ్డి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో గుర్రపు స్వారీ సమాచారం పోస్టు చేస్తున్నాడు.
RS world అనే గ్రూప్ ద్వారా గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు తిరుమల్ రెడ్డి. ఇక పోలీసులు అరెస్ట్ చేసిన 13 మంది పై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పట్టుబడ్డ వారు అందరూ కూడా బడా వ్యాపారస్తులే. గత ఏడాది నుండి బెట్టింగ్ దందా ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.