పంజాబ్‌లోని బటిండాలో ఈ నెల 23న అందాల పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యం లో పోటీ నిర్వాహకులు వేసిన పోస్టర్లు ప్రస్తుతం విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ పోస్టర్ల గురించి ఏకంగా పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఎందుకంటే ఈ పోటీలో గెలుపొందిన అమ్మాయికి కెనడియన్ ఎన్నారైని పెళ్లి చేసుకునే అవకాశం కల్పిస్తామని ఈ పోస్టర్లల్లో ఉండడం వివాదానికి దారి తీసింది.
అక్టోబరు 23న బటిండాలోని స్వీట్ మిలన్ హోటల్‌లో ప్రత్యేకమైన అందాల పోటీ నిర్వహించడం జరుగుతోంది. దీనిలో గెలుపొందిన అమ్మాయికి కెనడియన్ ఎన్నారై వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు ప్రచారం చేశారు. దీనికి సంబంధించి పోస్టర్లను నగరంలో పలుచోట్ల గోడలపై అతికించడంతో స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఈ ఈవెంట్ కోసం ప్రకటనలో “సుందర్ లడ్కియోన్ కా ముకబ్లా” (సాధారణ కులానికి మాత్రమే) అని నిర్వాహకులు ప్రత్యేకించి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్‌కు సంబంధించిన ఫొటో రిలీజైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారి గురించి ఇంకా ఎలాంటి సమాచారం లభించలేదు. మరో పక్క ఈ చర్య మహిళలను అవమానించడమేనని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నిర్వాహకులు కుల వివక్షను పెంచడమే కాకుండా మహిళలను అవమానిస్తున్నట్లు పోస్టర్లను బట్టి తెలుస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్‌పై రాసిన మొబైల్ నంబర్లలో నిర్వాహకులను సంప్రదించడానికి పలువురు ప్రయత్నించారు. అయితే రెండు నంబర్లూ డిస్‌కనెక్ట్ అవుతూన్నాయని వారు చెప్పారు.
ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి దీనిపై విచారణ ప్రారంభించారు. తమకు దీనికి సంబంధించి ఎలాంటి బుకింగ్ అందలేదని స్వీట్ మిలన్ యజమాని తెలిపారు. తన పేరును తప్పుగా వాడుకున్నారని పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పారు.