విద్యుత్ కోతలు ఆపాలంటూ ధర్నా చేసిన నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేస్తే అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
విద్యుత్ కోతలు ఆపాలంటూ ఎల్లారెడ్డి పేటలోని సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు శనివారం ధర్నా నిర్వహించారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పుడు ఏడు గంటలు కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
అయితే.. వారంతా చట్ట విరుద్దంగా సమావేశమయ్యారని, ప్రధాన రహదారిపై ధర్నా చేస్తూ ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగజేశారంటూ వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
మొత్తం 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో దొమ్మటి నర్సయ్య, ఎస్కే గౌస్, సుడిది రాజేందర్, రాజునాయక్ గంట బుచ్చ గౌడ్, బాలయ్య, దండు శ్రీనివాస్ లు ఉన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పార్టీ మండల అధ్యక్షుడు తెలిపారు.