గాంధీ ఆసుపత్రిలో అత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. హాస్పిటల్ లో ఎలాంటి అత్యాచారం జరగలేదని తేల్చారు. సుమారు 800 గంటల సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించామని… 200 మందిని విచారించామని తెలిపారు. మహిళపై గ్యాంగ్ రేప్ జరగలేదని స్పష్టం చేశారు.
మహబూబ్ నగర్ నుంచి ఈ నెల 5న కిడ్నీ సమస్యతో బాధపడుతున్న భర్తను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చింది ఓ మహిళ. ఆమె చెల్లి కూడా వారితోపాటు వచ్చింది. అయితే ఆసుపత్రిలో అత్యాచారం జరిగిందని.. ఒకరు కనిపించకుండా పోయారని వార్తలు బయటకొచ్చాయి. దీంతో పోలీసులు విచారణ జరిపి… మహిళపై అత్యాచారం జరిగిన ఆధారాలు లభించలేదని వెల్లడించారు.
ఇద్దరు మహిళలు కల్లుకు బానిసలని.. ఐదు రోజులపాటు తాగకపోవడంతో వారిలో విత్ డ్రాయల్ లక్షణాలు బయటపడ్డాయని గుర్తించారు. 11న రోగిని ఆసుపత్రిలోనే వదిలేసి అక్క వెళ్లిపోగా.. 15 వరకు ఆసుపత్రి ఆవరణలోనే ఆమె చెల్లెలు ఉందని తెలిపారు పోలీసులు. 12, 14 తేదీల్లో సెక్యూరిటీ గార్డుతో ఆమె సన్నిహితంగా మెలిగిందని.. ఎక్కడా అత్యాచారం జరిగినట్టు ఆధారాల్లేవని తేల్చారు. భర్తను వదిలేసి వెళ్లిన మహిళను నారాయణగూడలో పట్టుకున్నారు పోలీసులు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఆల్కహాల్ విత్ డ్రాయల్ లక్షణాలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పినట్లుగా వివరించారు పోలీసులు.