“కనిపించని ఆ నాల్గవ సింహమేరా పోలీస్” అని సాయికుమార్ డైలాగ్ ఖాకీ యూనిఫారం చూడగానే ఎవరికయినా ఫస్ట్ గుర్తొస్తుంది! కానీ సిద్ధాంతి ప్రతాప్‌కు మాత్రం తన పోలీస్ ఉద్యోగం ఊహించని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అందుకే నిన్న రాజీనామా ఇచ్చి, ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
29 ఏళ్ళ ప్రతాప్ బీటెక్ తరవాత ఏ డైలాగ్ చూసి స్ఫూర్తి చెందాడో కానీ, పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. 2014లో కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యినప్పటి నుంచి ఎంతో ఉత్సాహంతో పనిచేసేవాడు. నిన్న సడెన్‌గా తన రాజీనామాను సమర్పించాడు. తాను మానెయ్యడానికి అతనిచ్చిన రీజన్ విని అందరూ ఆశ్చర్యపోయారు. కానిస్టేబుల్ ఉద్యోగంలో ఎంటువంటి ప్రమోషన్లు ఉండవని, ఒక 30 – 40 ఏళ్ళు పనిచేసి రిటైర్ అవ్వాల్సిందేనని తన ఆవేదన వ్యక్తం చేస్తూ తన రాజీనామాకు అంతకంటే ఒక ముఖ్యమైన కారణం చెప్పి అందరికీ షాకిచ్చాడు. అదేంటంటే, కానిస్టేబుల్ అంటే ఎవరూ పిల్లనివ్వడం లేదంట.. ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక కూడా ఇంకా పెళ్లి కావడంతో ఈ ఉద్యోగం వద్దని చెప్పేశాడు. గంటల కొద్దీ పని, ఎదుగు బొదుగూ ఉండని జీవితాలు ఉండే కానిస్టేబుళ్లకు పెళ్లిళ్లు కావు అని ఏకరువు పెట్టాడు.
హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ప్రతాప్‌ని పై అధికారులు కూడా ఏమీ అనకుండా రాజీనామా యాక్సెప్ట్ చేసేశారు. కానిస్టేబుళ్ల కష్టాలు పక్కన పెడితే, సినీహీరోలను పోలీస్ యూనిఫారంలో చూసి చప్పట్లు కొట్టే అమ్మాయిలు, భర్తగా మాత్రం పోలీసోళ్ళు వద్దనుకోవడం ఏంటో!
ఇప్పుడు ఉద్యోగం వదిలొచ్చేసిన ప్రతాప్‌ను ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారో అనే డిస్కషన్ కూడా సోషల్ సర్కిల్స్‌లో జోరందుకుంది.