సంచలనం రేపిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ తోపాటు ఐదుగురు మైనర్లను విచారించారు పోలీసులు. మూడోరోజు విచారణలో భాగంగా ఘటన జరిగిన రోజు నిందితులు వ్యవహరించిన తీరుపై సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. పలు వివరాలు తెలుసుకున్నారు.
అమ్నేషియా పబ్, కాన్సూ బేకరీ, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36, 44 తదితర ప్రాంతాల్లో నిందితులను తిప్పారు పోలీసులు. ఘటన జరిగిన తీరును ఆరా తీశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను కూడా ప్రశ్నించారు. అందులో భాగంగానే సీన్ రీ కన్ స్ట్రక్షన్ కు వారిని స్పాట్స్ కు తీసుకెళ్లారు.
సాదుద్దీన్ కు కస్టడీ ముగియడంతో అతడ్ని జైలకు తరలించారు. మిగిలిన ఐదుగురు మైనర్లను జువైనల్ హోమ్ కి తీసుకెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం కస్టడీకి తీసుకుంటారు పోలీసులు. మరోవైపు ఆమ్నేషియా పబ్ సిబ్బంది, బౌన్సర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పబ్ లో మే 28న జరిగిన పార్టీపై ఆరా తీశారు. ఈవెంట్ బుకింగ్ ఎవరు చేశారు? ఎంతమంది వచ్చారనే దానిపై పబ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది. బాలిక మెడపై నిందితులు కొరికిన గుర్తులు ఉన్నాయి. మైనర్ బాలిక మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలు అయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే, మెడపై కొరికినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.