సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. ఇటీవలే నిందితులు హత్య చేసేందుకు వాడిన కత్తులు, దుస్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మరోసారి తాజాగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌తోపాటు కుమార్, చిరంజీవిని హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లారు. వామన్‌రావు దంపతులను ఎక్కడి నుంచి అనుసరించారో..ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించారో.. ఎలా హత్య చేశారో వారితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు పోలీసులు.
ప్రస్తుతం నిందితులు వరంగల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వారిని మంథని తీసుకొచ్చారు. తొలుత మంథని కోర్టు ప్రాంగణం, రిజిస్ట్రేషన్ ఆఫీస్, అంబేడ్కర్‌చౌక్‌కు వారికి తీసుకెళ్లారు. నిందితులు అక్కడ ఏమేం చేసారో పరిశీలించారు. అనంతరం హత్య జరిగిన కల్వచర్లకు నిందితులను తీసుకెళ్లారు. అక్కడ వామనరావు దంపతుల వాహనాన్ని అడ్డుకుని.. ఆపై దాడి చేసిన విధాన్ని నిందితులు పోలీసులకు వివరించారు.