ఓవైపు మునుగోడు ఉప ఎన్నిక సందడి నెలకొనగా.. ఇంకోవైపు హైదరాబాద్ లో హవాలా సొమ్ము బయటపడుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.3.5 కోట్లను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గాంధీనగర్ పరిధిలోని హోటల్ మ్యారియట్ దగ్గర టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 2 కార్లలో తరలిస్తున్న రూ.3.5 కోట్ల నగదును గుర్తించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపలేదు. దీంతో ఆదాయపు పన్ను అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
రెండు రోజుల క్రితం రూ.79 లక్షల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇమ్రాన్ మాలిక్, సల్మాన్ మాలిక్.. హైదరాబాద్ వాసులు వెంకట్ రెడ్డి, శేఖర్ రెండు వేర్వేరు కార్లలో రూ.79 లక్షలు తరలిస్తుండగా చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.
నగదుకు సంబంధించి వారి వద్ద ఎలాంటి ఆధారాలు, రసీదులు లేకపోవడంతో హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న సొమ్ముగా పోలీసులు గుర్తించారు. ఈ నగదు ఎవరి ఆదేశాలతో తీసుకువెళ్తున్నారు, ఎవరికి అందజేయడానికి అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు గాంధీనగర్ పరిధిలో రూ.3.5 కోట్ల నగదును గుర్తించారు. దీనిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.