ఖలిస్థాన్ నేత అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు జలంధర్ సమీపంలో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. . అతడు షాహ్ కోట్ సమీపంలో ఉన్నట్టు గుర్తించిన వారు నిన్న ఉదయం సుమారు 50 వాహనాల్లో వెళ్లారు. వారిని తప్పించుకోవడానికి అమృత్ పాల్ యత్నించినప్పటికీ, అతడిని వెంటాడి చివరకు నకోడర్ వద్ద అదుపులోకి తీసుకున్నారని, అంతకుముందే ఇతనికి సన్నిహితులైన ఆరుగురిని అరెస్టు చేశారని తెలిసింది. .అయితే అమృత్ పాల్ అరెస్టును పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
ఇక తన కొడుకును అమృత్ పాల్ సింగ్ తండ్రి తార్నెమ్ సింగ్ వెనకేసుకొచ్చారు. తన కొడుకు ఎక్కడున్నాడో తమకు తెలియదని, పోలీసులు తమ ఇంట్లో మూడు, నాలుగు గంటలు సోదాలు జరిపినా వారికి చట్టవిరుద్ధమైనదేదీ లభించలేదని ఆయన చెప్పారు. పోలీసుల చర్య న్యాయసమ్మతం కాదని, సరెండర్ కావలసిందిగా తన కొడుకును హెచ్చరిస్తున్నారని ఆయన అన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోరాటం చేస్తున్న అమృత్ పాల్ పై నేరస్తుడిగా పోలీసులు ఎందుకు ముద్ర వేస్తున్నారని ప్రశ్నించిన ఆయన.. మాదకద్రవ్యాల అక్రమ రావాణా, దందా సాగిస్తున్న క్రిమినల్స్ పై వారు ఎందుకు చర్య తీసుకోవడం లేదన్నారు.
పంజాబ్ లో ‘వారిస్ పంజాబ్ దే’ పేరిట ఆందోళన చేస్తున్న అమృత్ పాల్ నేతృత్వంలోని లోని 78 మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. తన కుమారుడి ప్రాణాలకు హాని తలపెడతారేమోనన్న ఆందోళనను తార్సెమ్ సింగ్ వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితమే తన కొడుకు పంజాబ్ కు వచ్చాడని, అతడు రాకముందు పోలీసులు ఏం చేశారని ఆయన అన్నారు. తన కొడుకును అరెస్టు చేయాలని వారిపై రాజకీయ ఒత్తిడి ఉందన్నారు.
ప్రతి ఇంటిలోనూ మాదకద్రవ్యాలు ఉన్నాయని, కానీ ఖాకీలు దీనిపై దృష్టి పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. జలంధర్ జిల్లాలో పోలీసులు తన ‘కాన్వాయ్’ ని అడ్డగించడానికి యత్నించినప్పుడు అమృత్ పాల్ సింగ్ తప్పించుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు అనేక చోట్ల గాలింపు ముమ్మరం చేయడమే గాక.. ఇంటర్నెట్, ఎస్ ఎం ఎస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. అమృత్ పాల్ పై ఎన్నో కేసులు నమోదై ఉన్నాయని వారు తెలిపారు. ముక్త్ సర్ జిల్లానుంచి ‘ఖల్సా వాహిర్’ పేరిట మతపరమైన ఊరేగింపును నిర్వహించడానికి అమృత్ పాల్ నిర్ణయించుకోగా అతడిని అరెస్టు చేసే యత్నాలను పోలీసులు తీవ్రం చేశారు.