తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్‌ను పట్టుకుని, డాక్టర్ వైశాలిని రక్షించారు పోలీసులు. అంతకుముందు తండ్రి దామోదర్‌కు డాక్టర్ వైశాలి ఫోన్ చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.
తాను క్షేమంగానే వున్నానని ఆమె తెలిపారు. తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను నగరంలోనే వున్నానంటూ తండ్రికి డాక్టర్ వైశాలి చెప్పినట్లుగాకొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
పోలీసులు కిడ్నాప్ కేసును 6 గంటల్లోనే ఛేదించి యువతిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సత్వరం స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో కిడ్నాప్ చేసిన వారిలో కొంతమందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితురాలు షాక్‌లో ఉందన్న పోలీసులు.. ఆమె కోలుకున్నాక మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందన్నారు.
ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో కలకలం సృష్టించింది. ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపై కర్రలు, కత్తులతో దాడిచేశారు.
యువతి బంధువులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. కిడ్నాప్ చేసిన యువకుడి టీ దుకాణాన్ని తగులబెట్టారు. పోలీసులు సంఘటన జరిగిన 6 గంటల లోపే అమ్మాయిని రక్షించారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…
నాగర్‌కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్‌రెడ్డి సైన్యంలో పనిచేసి కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మన్నెగూడలో కుటుంబంతో స్థిరపడ్డారు.కుమార్తె వైశాలి (24) నగరంలో బీడీఎస్ చదువుతోంది. బొంగుళూరులోని ఓ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో ఆమెకు హస్తినాపురం నివాసి మిస్టర్ టీ కంపెనీ ఎండీ కె.నవీన్‌రెడ్డి (29)తో 2021లో పరిచయం ఏర్పడింది. అతడి స్వస్థలం నల్గొండ జిల్లా ముషంపల్లి. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
రెండు కుటుంబాలు కలిసి గోవా, విశాఖపట్నం తదితర పర్యాటక ప్రాంతాలు చుట్టొచ్చాయి. పెళ్లి విషయంలో కుటుంబాల మధ్య స్పర్థలు తలెత్తాయి. అప్పటి నుంచి ఆమె నవీన్‌రెడ్డిని దూరంగా ఉంచింది. దీన్ని మనసులో ఉంచుకొని వాట్సప్ మెసేజ్‌లు పంపటంతో యువతి కుటుంబ సభ్యులు సెప్టెంబరులో ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత బెయిలుపై బయటకు వచ్చి మన్నెగూడ సిరి టౌన్‌షిప్ కాలనీకి మకాం మార్చాడు. యువతి ఇంటి సమీపంలోనే ఖాళీ ప్లాటును లీజుకు తీసుకుని రెస్టారెంట్ ఏర్పాటుకు షెడ్ నిర్మించాడు.
‘‘గతేడాది ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలోని దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం. తన కూతురు బీడీఎస్ పూర్తి చేసేంత వరకూ పెళ్లి విషయం బయట పెట్టవద్దని ఆమె తండ్రి కోరారు. కొత్తగా కొనుక్కున్న కారుకు ఆమే నామినీ. ఈ ఏడాది జులై 1 నుంచి ఆమె తల్లిదండ్రులు బెదిరించి నా భార్య మనసు మార్చారు’’ అని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నవీన్‌రెడ్డి కేసు వేశాడు.
తనకు విడాకులు ఇవ్వకుండానే ఆమె ఇతరులతో పెళ్లికి సిద్ధపడుతోందంటూ ఆధారాలు చూపుతూ కోర్టు ద్వారా పోలీసులకు, యువతి కుటుంబ సభ్యులకు నోటీసులు పంపాడు.తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం కుదిరిందని, శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మన్నెగూడలోని ఆమె నివాసంలో నిశ్చయ తాంబూలాలకు ముహూర్తమని నవీన్‌రెడ్డికి తెలిసింది.
పెళ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు 5 కార్లు, డీసీఎం, ద్విచక్ర వాహనాల్లో సుమారు 100 మందితో నవీన్‌రెడ్డి.. యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నిఛర్‌ను, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఫోన్లు పగలగొట్టారు. అడ్డొచ్చిన యువతి తండ్రిని తీవ్రంగా కొట్టారు. తల్లిని పక్కకు నెట్టారు. ఓ బంధువుని ఇనుపరాడ్లతో కొట్టారు. యువతిని నవీన్‌రెడ్డి కారులో అపహరించుకు పోయాడు.
సుమారు 40 నిమిషాల్లోనే ఇదంతా ముగిసింది. పక్కా రెక్కీతో అపహరణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంతో యువతి తండ్రి దామోదర్‌రెడ్డి, బంధువులు సాగర్ రహదారిపై బైఠాయించారు. మన్నెగూడలో నిందితుడి టీ దుకాణాన్ని తగులబెట్టారు. ఆదిభట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఐను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. నవీన్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినపుడు పోలీసులు అతడికే మద్దతు పలికినట్లు తండ్రి ఆరోపించారు. కిడ్నాప్ సమయంలో డయల్ 100కు ఫోన్ చేసినా గంట వరకు పోలీసులు రాలేదన్నారు.
కుడుదుల నవీన్‌రెడ్డి(29) అలియాస్ కేఎన్‌ఆర్ విజయవాడలో సీఏ ఇంటర్ చేసిన తర్వాత వ్యాపారం వైపు అడుగులు వేశాడు. మిస్టర్ టీ స్థాపించాడు. దేశవ్యాప్తంగా 400 వరకూ ఫ్రాంచైజీలు ఇచ్చాడు. హస్తినాపురంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశాడు. స్వగ్రామంలో అతడికి ఇల్లుతో పాటు 4ఎకరాల భూమి ఉంది. తండ్రి కోటిరెడ్డి వ్యవసాయం చేసే వాడని, 6 నెలల క్రితం తల్లిదండ్రులను సైతం మన్నెగూడలోని ఇంటికి తీసుకెళ్లినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులతో నవీన్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నట్టు సమాచారం.
మన్నెగూడా కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశాం. అమ్మాయిని కూడా కాపాడం. ప్రస్తుతానికి బాధిత యువతి షాక్ లో ఉంది. కిడ్నప్ చేసిన వెంటనే యువతిని కొట్టారు. తీవ్రంగా భయపెట్టారు.ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలో లేదు. కిడ్నప్ జరిగిన ఆరు గంటల్లోనే యువతిని కాపాడం.ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాప్. నవీన్ రెడ్డి ఇంకా అరెస్ట్ చేయలేదు.. అతని కోసం టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్ళని పట్టుకుంటాం.
సుధీర్ బాబు, అడిషనల్ సీపీ, రాచకొండ