నగరంలో సంచలనం రేపిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణకొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు.. తాజాగా చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అనిల్, అభిషేక్ ను కలిపి అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత.. బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు.
ఈ కేసులో ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన పోలీసులు.. నేటి నుంచి 4రోజుల పాటు ఇద్దరినీ విచారించనున్నట్టు వెల్లడించారు. అభిషేక్, అనిల్ మొబైల్ ఫోన్ లను పరిశీలించిన పోలీసులు.. వీరిద్దరికీ మాదక ద్రవ్యాల విక్రేతలతో సంబంధాలున్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య 20 సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నట్లు నిర్థారణ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పబ్‌పై దాడి జరిగిన రోజు మూడు నాలుగు గంటల వ్యవధిలో అభిషేక్, అనిల్ మధ్య 15సార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గోవా, ముంబయి నుంచి కొకైన్ తీసుకొచ్చి పబ్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరెవరికి విక్రయించారనే కోణంలో పోలీసులు అభిషేక్, అనిల్‌ను ప్రశ్నించనున్నట్టు పోలీసులు తెలిపారు.
పుడింగ్ పబ్ కేసులో నెల రోజుల వ్యవధిలోనే మూడు పార్టీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మూడు పార్టీల్లోనూ తరచూ పబ్ కు వచ్చే వ్యక్తులే పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ పార్టీల్లోనూ కొకైన్ సరఫరా జరిగిండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్, అనిల్ లు మాట్లాడుకున్న కాల్ రికార్డులను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.