యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత ప్రత్యేక పూజలు చేశారు బండి. ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. లక్ష్మి నరసింహ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని చెప్పారు సంజయ్.
మరోవైపు బండి కాన్వాయ్ లోని అన్ని వాహనాలను కొండపైకి వెళ్లేందుకు అనుమతించలేదు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఇది కేసీఆర్ గుడా? లేదా భక్తుల గుడా. అంటూ బీజేపీ నేతలు నిరసన తెలిపారు. బండి వెంట గూడూరు నారాయణరెడ్డి, బిక్షమయ్య గౌడ్ సహా పలువురు నేతలు ఉన్నారు. గురువారం నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నారు బండి. ఈ నేపథ్యంలో లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా నుంచి బండి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించి పాదయాత్రను స్టార్ట్ చేస్తారు. దాదాపు 2వందల రోజుల పాటు ఈ యాత్రకు ప్లాన్ చేశారు.