బహుజన రాజ్యం కోసం రాష్ట్రంలో యాత్ర కొనసాగిస్తున్నారు బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తరతరాలు చదువుకు దూరమై సంపదకు దూరంగా నెట్టబడ్డ ప్రజల విముక్తే తమ లక్ష్యమంటూ ముందుకు కదులుతుతున్నారు. ప్రస్తుతం ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సూర్యాపేట చేరుకుంది. అయితే.. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లారు ఆర్‌ఎస్పీ. కానీ.. ఆయనకు ఊహించన సంఘటన ఎదురైంది.
ఆర్‌ఎస్ ప్రవీణ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ప్రోటోకాల్ అంటూ అనుమతించలేదు. దీంతో ఆయన పోలీసులు, అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పేరుతో దళితులను అంబేద్కర్ కు దూరం చేస్తారా..? అంటూ మండిపడ్డారు. విగ్రహానికి మంత్రి దండ వేసే వరకు ఎవరూ వేయకూడదని పోలీసులు చెప్పారన్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని మండిపడ్డారు.
పోలీసులతో మాట్లాడి లాభం లేదని.. మంత్రినే నిలదీశారు ఆర్‌ఎస్ ప్రవీణ్. జరిగిందంతా చెప్తే.. తానేం అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని జగదీష్ రెడ్డి చెప్పారు. మరి.. తనను ఎందుకు ఆపారని ప్రశ్నించారు ఆర్‌ఎస్పీ. తమకూ వంద ప్రోగ్రాంలు ఉంటాయని అన్నారు.
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగుతోందని.. ముఖ్యమంత్రి రాజ్యాంగం కిల్ చేయాలని అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడడానికి కారణమైన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయనివ్వరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా.. ఎన్ని రోజులు బెదిరిస్తారు.. మళ్లీ ఇలాంటివి పునరావృతం అయితే.. తర్వాత జరిగే పరిణమాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని హెచ్చరించారు ఆర్‌ఎస్ ప్రవీణ్.