రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు పోలీసులు. డీజీపీ ఆఫీస్ లో సీనియర్ పోలీస్ అధికారుల సమావేశం జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కర్మన్ ఘాట్ ఘటన నేపథ్యంలో ఇంచార్జ్ డీజీపీ అంజనీ కుమార్.. సీపీలు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్రతో భేటీ అయ్యారు. ఇంటెలిజెన్స్, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీలు అనీల్ కుమార్, జితేందర్, నార్త్ జోన్ ఏడీజీ నాగిరెడ్డి కూడా పాల్గొన్నారు.
చట్టాన్నితమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే ఏ వ్యక్తినిగానీ, గ్రూపులను గానీ సహించేది లేదని సమావేశంలో నిర్ణయించారు పోలీసులు. కర్మన్ ఘాట్ ఘటనలో ఇప్పటికే 5 కేసులు నమోదు చేశామని తెలిపారు. చట్టాలను అతిక్రమించే వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఎంతటి వారైనా సరే హిస్టరీ షీట్ లను, కమ్యూనల్ షీట్ లను తెరవాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా మత విద్వేషాలు రేకెత్తించే శక్తులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని హెచ్చరించారు.
ఇటు కర్మన్ ఘాట్ ఘటనలో ఏడుగురిని మీర్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. భవానీనగర్ కు చెందిన మహ్మద్ యూసుఫ్, మహ్మద్ నిసార్, మహ్మద్ నవాజ్‌తో పాటు మరో నలుగురు బోలేరో వాహనంలో గోవులను తరలిస్తున్నారు. గాయత్రీనగర్ దగ్గర గోరక్షక్ దళ్ సభ్యులు వాహనాన్ని ఆపమన్నారు. కానీ.. వారు ముందుకు వెళ్లిపోయారు. దీంతో గోరక్షక్ దళ్ సభ్యులు వెంబడించి వాహనాన్ని ఆపారు. ఈ క్రమంలోనే వారిపై దాడి జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద 5 కేసులు నమోదు చేసి… ఏడుగురిని అరెస్ట్ చేశారు.