తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యం అంటూ… వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు వైఎస్ షర్మిల. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఆమె, అదే రోజు పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు. పార్టీ విధివిధానాలతో పాటు పలు అంశాలపై మాట్లాడనున్నారు.
అయితే, రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సభలు, సమావేశాలు, భారీ ర్యాలీలకు అనుమతి లేదని… స్పష్టం చేసింది. కానీ షర్మిల సభకు ఇప్పటికే పోలీసులు అనుమతిచ్చినా… పరిమిత సంఖ్యలో జనం హజరుకావాలని సూచించినట్లు తెలుస్తోంది.
పైగా.. ఆ అనుమతులు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో షర్మిల సభకు పోలీసులు అనుమతి రద్దు చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. బహిరంగ సభలో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడటం సాధ్యపడదని అభిప్రాయపడుతున్నారు.
ఇటు కోవిడ్ వార్తల నేపథ్యంలో షర్మిల టీం కూడా ఎప్పుడెం జరుగుతుందో అన్న టెన్షన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.