ఇంగ్లీష్ మీడియం పరిస్థితి అదేనా...? - Tolivelugu

ఇంగ్లీష్ మీడియం పరిస్థితి అదేనా…?

సయ్యద్ రఫి, రాజకీయ విశ్లేషకులు.

మాతృ భాషలు ఉర్దూ,తెలుగు ఎలా అంతమౌతున్నాయో కొన్ని చారిత్రాత్మక విషయాలు పరిశీలిద్దాం… ఉమ్మడి రాష్ట్రంలో కోస్తా,రాయలసీమ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఉన్నప్పుడు ఒకటో తరగతి నుండి ముస్లిం విద్యార్థులకు ఒక పీరియడ్ ఉర్దూ కూడా ఉండేది. ముస్లిం విద్యార్థులకు ఉర్దూ భోదించే ఒక టీచర్ ఉండేవారు. స్కూల్ లో మొత్తం తరగతుల వారందరికి వివిధ పీరియడ్స్ లో ఉర్దూ నేర్పేవారు. విద్యార్థులు అందరూ ఉర్దూ రాయటం, చదవటం నేర్చుకునే వారు. రాను రాను ఉర్దూ టీచర్ల సంఖ్య తగ్గిపోయి ఉర్దూ చెప్పే టీచర్లు లేకుండా పోయింది.

కారణం ఉర్దూ టీచర్లు నియామకం ప్రభుత్వం చేయకపోవడమే. దాంతో ముస్లిం విద్యార్థులు ఉర్దూ నేర్చుకునే వీలు లేకుండా పోయింది. దాంతో ముస్లిమ్ విద్యార్థులకు ఉర్దూ బోధన కరువయింది. కోస్తా జిల్లాల్లో ముస్లిం విద్యార్థులు ఉర్దూ నేర్చుకునే వీలులేకుండా పోయింది. దింతో ముస్లిం ఇంట్లో ఉర్దూని వాడుక భాషగా మాట్లాడం తప్పితే ఉర్దూ చదవటం, వ్రాయటం పూర్తిగా మర్చిపోయారు. అది పూర్తి స్థాయిలో ఉర్దూ కాదు. ఎక్కడో అర కోర మంది మసీదుల్లో, మదర్శల్లో చదివే వారే ఉర్దూ భాష ని నేర్చుకున్నవారు, నేర్చుకుంటున్నవారు ఉన్నారు. వారి సంఖ్య అతి స్వల్పం. తెలంగాణలో పరిస్థితి దీనికి భిన్నం. అక్కడ నిజాం పాలన నుండి ఉర్దూ అధికార భాష ఉండటం, ముస్లిం జనాభా అధికంగా ఉండటం వల్ల ముస్లిం విద్యార్థులు ఉర్దూ బాగానే నేర్చుకున్నారు.

అయితే ఉద్యోగ అవకాశాలు లేక పోవటం తో తెలంగాణలో కూడా ఉర్దూ మాధ్యమం ఆదరణ కోల్పోయింది. కాకపోతే మదర్శలా సంఖ్య అధికంగా ఉండటంతో తెలంగాణలో ఉర్దూ రాసేవారి సంఖ్య, చదివే వారి సంఖ్య… కోస్టా రాయల సీమ తో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మాట్లాడే ఉర్దూ పరిపూర్ణ మైనది కాదు. కారణం ఉర్దూ విద్యాబోధన లేకపోవటమే. అలా నెమ్మదిగా ఉర్దూ అంతరించి పోయింది.

ఇక తెలుగు భాష విషయానికి వద్దాం. ముప్పయి ఏళ్లకు మునుపు ఉమ్మడి రాష్ట్రంలో అందరూ ప్రభుత్వ పాఠశాల లోనే చదువుకునే వారు. తారతమ్య భేదాలు లేకుండా ఉన్న వాళ్లు లేని వాళ్ళు కులాలకు, మతాలకు అతీతంగా అందరూ ఒకే బడి లో చవకగా నామినల్ ఫీజుల తో చదువుకునే అవకాశం ఉండేది. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్లు, కాలేజీలు నిర్మాణం చేయటం అందుకు తగ్గ టీచర్ల నియామకం ప్రభుత్యానికి తలకు మించిన భారంగా ప్రభుత్యాలు భావించటం మొదలయ్యింది. విద్యాలయాల్లో లైబ్రరీలు,లాబ్ లు ఏర్పాటు, భోదననేతర సిబ్బంది నియామకాలు కూడా అనవసర ఖర్చుగా ప్రభుత్యాలు భావించి, కుదింపుని చేపట్టి విద్యను ప్రైవేటు రంగానికి తలపులు తెరవటం జరిగింది. ఈ నిర్ణయంతో విద్య పూర్తిగా వ్యాపార మయంగా మారింది.

ఎప్పుడైతే ప్రైవేట్‌ కాన్వెంట్ లు వెలిసాయో ధనిక వర్గం తమ పిల్లల్ని ఆ కాన్వెంటు స్కూళ్లు లో చేర్చటం మొదలయ్యింది. అక్కడ కరెంటు, నీళ్ళు, పిల్లలు కూర్చుని చదువుకునే కుర్చీలు, బెంచిలు లాబ్ లు రవాణా సదుపాయాలు బాగా ఏర్పాటు చేసిన కారణంగా ధనిక వర్గం ఫీజుల లెక్కచేకుండా తమ పిల్లలను కాన్వెంట్‌ బడుల్లో చేర్పించటమే కాదు అక్కడ పూర్తిగా ఆంగ్లమాద్యమం మాత్రమే ఉండటం తో అదో గొప్పగా భావించి తమ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పితే ఉద్యోగ అవకాశాలు దక్కించుకునే వీలు ఉంటుందని భావించారు. అవకాశాలు కూడా అలాగే వారికి వచ్చాయి. దీనితో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వారు కుడా తమ పిల్లలను ఇంగ్లీష్ కాన్వెంట్లో చదివించటం ప్రారంభించారు. తెలుగు ఒక సబ్జెక్టు గా ఉన్నా అధిక శాతం విద్యార్థులు తెలుగు మీద పట్టుకొల్పోయారు. అంతే కాదు ఆసక్తి కూడా కోల్పోయారు. ఇక ఆ తర్వాత డిగ్రీలు పోయి ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరటం ప్రారంభమైంది. అక్కడ పూర్తిగా ఇంగ్లీష్ లోనే చదువు. తెలుగు అవసరం లేకుండా పోయింది. చదువు అంటే కేవలం ఉద్యోగం కోసం మాత్రమే అనేది ముందుకు వచ్చింది. తెలుగు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. ఇంజినీరింగ్ చదివిన వారందరూ ఆయా చదువు లకు తగ్గా ఉద్యోగాలు పొందుతున్నారా అంటే అది లేదు. ఏదోఒక ఉద్యోగం వస్తే చాలని అనుకుని ఏదోఒకటి చేసుకుంటున్నారు.

అధిక సంఖ్యలో నిరుద్యోగులు గానే ఉన్నారు. ఇంగ్లీష్ లో చదివినా ఉద్యోగం రావటం లేదు. మంచి నాణ్యమైన విద్యను అందించే కొన్ని కాలేజీలలో లక్షల్లో ఫీజులు చెల్లించి చదివిన వారికి తప్పితే దేశంలో గాని విదేశాల్లో గాని ఉద్యోగాలు రావటం లేదు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో చదివిన విద్యార్థులు నాణ్యత లేని కాలేజీలలో సీటు వస్తే ఇంజినీరింగ్ చదివి పట్టా పుచ్చుకుంటున్నారే గాని సరైన ఉద్యోగం సంపాదించలేక పోతున్నారు. దీనితో రెండికి చేడిన రేవడి చందంగా మారింది ఈ చదువుల ప్రస్థానం. ఒక పక్క మాతృభాషకు దూరం అయ్యారు. మరోపక్క ఇంగ్లీష్ మీద పట్టు సాధించేందించలేక బోర్లా పడ్డారు నేటి విద్యార్థులు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించకుండా మొత్తం ఆంగ్ల మాధ్యమంలోకి విద్యార్థులను నెట్టితే సరైన బోధనా సామర్ధ్యం లేని అనుభవం లేని టీచర్లు తో ఆంగ్లంలో బోధన చేయటం అంటే తల క్రింద కాళ్లు పైన పెట్టి నడిపించటమే.

అసలే మాతృభాషలు ఉర్దూ, తెలుగు కు ఎలా విద్యార్థులు దూరం అయ్యారో ఇంగ్లీష్ కు కూడా దూరం అవుతారు. ప్రభుత్వం విద్యార్థులు భవిష్యత్‌ దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల విద్యాలయాల్లో 1-6 వరకు మాతృభాష లోనే విద్యాబోధన చేస్తూ చర్యలు తీసుకోవాలని, ఆంగ్లంలో కూడా సమానంగా విద్యాబోధన ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. బడుగు బలహీన వర్గాలు పేద, మధ్య తరగతి పిల్లులకు ఆంగ్లంలో చదువు చెప్పడం అనే కోరిక కోసం వాస్తవాలకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే వారికి మేలు కంటే కీడు ఎక్కవగా జరిగే ప్రమాదం ఉంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp