రంగంలో రాబిన్ టీమ్ -political analyst pk aide robin sharma teamed up with lokesh team in mangalagiri - Tolivelugu

రంగంలో రాబిన్ టీమ్

political analyst pk aide robin sharma teamed up with lokesh team in mangalagiri, రంగంలో రాబిన్ టీమ్

పాలిటిక్స్‌లో ‘పీకే ఫీవర్’ టీడీపీకి కూడా పాకింది. మొన్నటి ఎన్నికలలో జగన్ గెలుపులో ముఖ్య భూమికగా మీడియా వార్తల్లో చోటుచేసుకున్న ప్రశాంత్‌కిశోర్ బృందం ఇప్పుడు టీడీపీ యువ నేత లోకేశ్ కోసం పనిచేయడానికి సూట్ కేస్ సర్దుకుని మంగళగిరిలో ల్యాండ్ అయిపోతోంది. కాకపోతే, ఇక్కడ వ్యూహ బృంద సారధి పీకే కాదు, అతని శిష్యుడు రాబిన్ శర్మ. ఇప్పటికే ఈ బృందం రంగంలోకి దిగిందని రూఢీగా అందిన ఇన్ఫర్మేషన్.

political analyst pk aide robin sharma teamed up with lokesh team in mangalagiri, రంగంలో రాబిన్ టీమ్రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్‌కిషోర్‌కు ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. ఏపీలో జగన్ గెలిచాడని తెలియగానే పశ్చిమబెంగాల్‌లో దీదీ వెంటనే అతన్ని కాంటాక్ట్ చేసినట్టు వార్తలొచ్చాయ్. పీకే టీమ్ ఏ రాజకీయ శిబిరంలో వుంటే ఆ పార్టీ అధికారానికి చేరువయినట్టేనని దాదాపు అందరి మైండులో బాగా ఫిక్సయిపోయింది. తెలుగుదేశం ఘోర పరాజయం తరువాత చంద్రబాబు శిబిరం కూడా పీకే టీమ్‌తో సంప్రదింపులు చేస్తే మంచిదనే సలహాలు, సూచనలు కేడర్ నుంచి వచ్చాయి. టీడీపీ నాయకత్వం పీకేతో మాట్లాడినట్టు వదంతులు కూడా వచ్చాయి. ఐతే, ఎన్నికలకు ముందు ప్రశాంత్‌కిశోర్‌ బృందాన్ని బీహార్ ముఠాగా తీవ్ర పదజాలంతో తిట్టిపోసిన చంద్రబాబు ఓటమి తరువాత అతగాణ్ణి వ్యూహ‌క‌ర్తగా ఎలా ఎంపిక చేసుకుంటారనే నైతిక ప్రశ్న ఒకటి రైజ్ అయ్యింది. తరువాత మేటర్ మరుగున పడినా యువనేత లోకేశ్ దీన్ని అంత వీజీగా తీసుకోలేదని టాక్. పీకే టీమ్‌తో టచ్‌లో వున్నారని, కాకపోతే, నేరుగా పీకేని కాకుండా అతని దగ్గర చాన్నాళ్లు పనిచేసిన రాబిన్‌శర్మని తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ వుండదని తీవ్రంగా ఆలోచించి, తనకు అనుకూల మీడియా మిత్రులతో కూడా సంప్రదింపులు జరిపి చివరికి అతనికి కబురెట్టారని తెలిసింది.

లోకేశ్ అంతగా పీకే ముఠాపై ఫోకస్ పెట్టడానికి కూడా కారణం వుంది. పీకే రాజకీయ వ్యూహాల్లో ‘అనేక యుద్ధముల ఆరితేరిన’ వ్యూహకర్త. ఏపీలో జగన్ చారిత్ర‌క విజ‌యం వెనుక అతను మినహా మరెవ్వరూ లేరు. జ‌గ‌న్ గుడ్డిగా అతని వెంట నడిచాడని చెబుతుంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతుంటారు. ఒకానొక స్ట్రాటజీ మీటింగులో జగన్ అండ్ అదర్స్‌తో పాటు పీకే కూడా కూర్చున్నాడట. ‘ప్రత్యర్ధి రాజకీయ శిబిరంలో బలాబలాలేంటి’ అనే అంశంపై డిస్కషన్ జరుగుతోందట. టీడీపీకి అతి పెద్ద ఓటు బ్యాంక్ ఏంటని పీకే అడిగాడట. అందరూ ఒకే గొంతుకగా ‘ఇంకేంటి.. బీసీలే’ అని చెప్పారట. సరే అయితే, రేపటి నుంచి మనం ఆ ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నాం. వైసీపీ అంటే బీసీల పార్టీ అనేలా నేను కొన్ని ఐడియాలు చెబుతాను.. ఫాలో మీ.. అన్నాడట. దాంతో, కంగారు పడిన కొంతమంది పెద్దలు ‘అబ్బే.. మనకు కాపుల నుంచి ప్రాబ్లమ్ వస్తుంది, వాళ్లు మనకు సంప్రదాయ ఓటర్లు’ అని ఏదో చెప్పబోయారట. దానికి వెంటనే కౌంటర్ ఇస్తూ.. ‘ఎవరు చెప్పారు మీకు కాపులు వోట్లు గంప గుత్తగా మీకే పడతాయని.? పవన్‌కల్యాణ్ ఎటూ కాపుల ఓట్లు చీల్చుకుంటున్నాడు. మరికొన్ని కాపుల ఓట్లు చంద్రబాబు పెట్టిన కాపు కార్పొరేషన్ ఇచ్చిన రుణాలతో అటు పోతాయి. ఇక, వైస్ రాజశేఖరరెడ్డికి ఆనాటి నుంచి ప్రాణం పెట్టే కొంతమంది కాపు నేతలే మన వెంట వుంటారు. వాళ్లు ఎప్పటికీ వుంటారు. వాళ్లు ఫీలవుతారని బీసీల్ని ఎందుకు వదులుకోవాలి.?’ అని ప్రశ్నించాడట. జగన్‌కు ఈ లాజిక్ బాగా నచ్చి ఆనాటి నుంచి తన పాదయాత్రలో బీసీ ఓటు బ్యాంక్‌ను తన వైపు లాక్కుంటూ వచ్చడట. ఎక్కడ బీసీ ఓటు బ్యాంక్ బాగా వుంటే అక్కడ సామాన్య జనం నుంచి బీసీ అభ్యర్ధిని వెతికి మరీ పాదయాత్రలో టిక్కెట్లు ప్రకటించుకుంటూ పోయాడని టాక్. సామాన్యుల్ని అభ్యర్ధులుగా ఎంపిక చేయడం కూడా పీకే చెప్పిన స్ట్రాటజీయేనట. జనం ఎప్పుడూ తమ నాయకుడిలో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారని, జనం నుంచి వచ్చే వాళ్లయితే గ్యారంటీగా వర్కవుట్ అవుతుందని పీకే ఫిక్స్ చేసిన ఫార్మెట్. దాన్ని యాజిటీజుగా ఫాలో అయిపోయాడు కాబట్టే జగన్ అసాధారణ విజయం సాధించారని కొంతమంది అనలిస్టులు చెబుతుంటారు.

చంద్ర‌బాబుకు కూడా పీకే ప్రభావం ఏంటో చాలా స్పష్టంగా తెలుసును. ప్రత్యర్ధి శిబిరంలో పీకే ప్రభావం ఏమిటో ఎన్నిక‌ల ముందే ప‌సిగ‌ట్టారని అంటారు. అందుకే, నైతికంగా దెబ్బ‌కొట్టేందుకు పీకేపై తీవ్ర పదజాలంతో అనేక విమ‌ర్శ‌లు చేశారు. బీహార్ గ్యాంగ్ అని పదేపదే చేసిన పద ప్రయోగం కూడా అందులో భాగమే. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత జ‌గ‌న్ విజ‌యానికి పీకే వ్యూహాలు బాగా ప‌నిచేశాయ‌ని అందరూ ఒక నిర్ధార‌ణ‌కు రావడంతో చంద్రబాబు కూడా  ఆలోచనలో పడ్డారని, ముందు తన దగ్గర, తన వారసుడి దగ్గర వున్న స్ట్రాటజిస్టుల్ని, ట్యూషన్ మాస్టర్లని వదిలించుకున్నారని అంటారు.

తర్వాత ఇటీవలి కాలంలో లోకేశ్ త‌మ కోసం ప‌నిచేయాల్సిందిగా పీకే బృందానికి చెందిన ఐప్యాక్ సంస్థని సంప్రదించినట్టుగా వార్తలొచ్చాయి. ఇప్ప‌టికీ వైసీపీతో ఒప్పందాన్ని కొన‌సాగిస్తున్నందున నేరుగా పీకే టీమ్ ఎంటరయితే ఉభయులకూ అది మంచిది కాదని చెప్పడంతో అక్కడితో అది ఆగిపోయిందని సమాచారం.

ఇలావుంటే, రాబిన్‌శర్మ అనే వ్యక్తి పీకే టీమ్ నుంచి తేడా వచ్చి బయటికి వచ్చేసి లోకేశ్‌ను సంప్రదించారని తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్. పీకే బృందంలో రాబిన్‌శర్మ సెకండ్ కమాండ్ అంటారు. వ్యూహాలు అల్లడంలో అక్కడ ప్రధాన భూమిక ఇతగాడిదేనని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అలాంటి వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ దిశానిర్ధేశం కోసం తగిన వ్యూహ రచన చేయడంలో సహకరిస్తామని చెప్పడంతో చంద్ర‌బాబు.. తన సహజ ధోరణిలో అనేక విడతలుగా తన సహచరులతో సంప్రదింపులు చేసి చివరకు ఓకే చేశారని టాక్.

రాబిన్‌శ‌ర్మ వంటి కార్పొరేట్ తరహా ప్రొఫెష‌న‌ల్‌ స్ట్రాటజిస్ట్ వచ్చి తమతో కలవడం తమకు అదనపు బలమని లోకేశ్ అనుచరులు చెబుతున్నారు. సాధారణంగా రాజ‌కీయ వ్యూహాలు ప‌న్న‌డంలో చంద్ర‌బాబే పెద్ద తోపు అని పార్టీవర్గాలు చెబుతుంటాయి. అలాంటి తోపు దగ్గర మరో ప్రొఫెషనల్ తోపు చేరారని, ఇక వచ్చే జమిలీ ఎన్నికల్లో తమకు తిరుగేలేదని పార్టీవర్గాలు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి.

రాబిన్‌శ‌ర్మ‌కు పెద్ద ఆల్‌టైమ్ రికార్డే ఉంది. ప్ర‌శాంత్‌కిషోర్‌కు అతను ప్రధాన శిష్యుడు. పీకే బృందంలో సెకండ్ కమాండ్ ఇతనిదే. పీకేతో క‌లిసి సిటిజ‌న్స్ ఫ‌ర్ అకౌంట‌బుల్ గ‌వ‌ర్నెన్స్‌ (సీఏజీ) అనే సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. ప్ర‌శాంత్‌కిషోర్‌ సారధిగా వున్న ‘ఐప్యాక్’ సంస్థ‌లో మొదటినుంచి రాబిన్ కీ రోల్ నిర్వ‌ర్తించారు. 2014 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీ విజ‌యానికి బాగా ఉప‌యోగ‌ప‌డిన ‘చాయ్ పే చ‌ర్చ’ కార్య‌క్ర‌మానికి ప్ర‌చార బాధ్య‌త‌లు రాబిన్‌శ‌ర్మే చూశారు. ఆ ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ప్ర‌చారాన్ని కూడా రాబిన్ దగ్గరుండి చూసుకున్నారు. 2015లో ఐప్యాక్ సంస్థ బిహార్‌లో నితీష్ కుమార్ కోసం ప‌నిచేసింది. అప్పుడు ‘హ‌ర్ ఘ‌ర్ నితీష్ – హ‌ర్ మ‌న్ నితీష్’ పేరుతో నిర్వ‌హించిన ప్ర‌చార బాధ్య‌త‌లు రాబిన్ విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాహుల్‌గాంధీ నిర్వ‌హించిన ఖాట్ స‌భ‌ల ప్ర‌చారాన్ని కూడా రాబిన్‌శ‌ర్మే చూసుకున్నారు. త‌ర్వాత కొంత‌కాలం కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసి ఎన్నిక‌ల ముందు ‘నేతా యాప్’ అనే ఓ సంస్థ‌కు సీఈఓగా ప‌నిచేశారు. ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన రాబిన్‌శ‌ర్మ రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డంలో ఆరితేరి ఉన్నారు. పీకే టీమ్‌లో కీల‌క స‌భ్యుడిగా ప‌నిచేసిన అనుభ‌వంతో ఆయ‌న ఇప్పుడు సొంతంగా ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ తెలుసుకునే చంద్ర‌బాబు అతన్ని ఎంపికచేశారని తెలుస్తోంది. ఇప్పటికే భారీ ప్యాకేజీకి డీల్ కూడా కుదిరింద‌నే వార్త‌లు వ‌స్తున్నా టీడీపీ వ‌ర్గాలు అధికారికంగా ధృవీక‌రించ‌డం లేదు.

ఇప్పటికే రాబిన్ టీమ్ గుజరాత్ నుంచి తన టాస్క్ షురూ చేసిందని ఒక టాక్. రోజూ అక్కడి నుంచి టెలి కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఐడియాలు కుమ్మేస్తోందని కూడా అంటున్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అనుకూల మీడియాకు చెందిన కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా పాల్గొంటున్నారని ఈమధ్య వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త బాగా వైరల్ అయ్యింది. దీన్ని కొట్టి పారేయడానికి కూడా ఏదీ లేదు. మొదటి నుంచి చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ మీడియా మిత్రులను కూడా కొన్ని విషయాల్లో సలహాలు అడుగుతుంటారు. సంప్రదింపులు చేస్తుంటారు.

ఇలావుంటే, ప్రస్తుతం లోకేశ్ ట్విటర్ ఖాతాను కూడా రాబిన్ హ్యాండిల్ చేస్తున్నారని ఒక సమాచారం. అందుకే ఇటీవలి కాలంలో యువ నేత సోషల్ మీడియా అవుట్‌పుట్‌లో గుణాత్మక మార్పు కనిసిస్తోందని అంటున్నారు. త్వరలో రాబిన్ టీమ్ మంగళగిరి కేంద్రంగా కార్యకలాపాల్ని ఆరంభించబోతోందని తెలుస్తోంది. ఈ బృందానికి అవసరమైన సభ్యుల ఎంపిక స్థానికంగానే చేయాలని రాబిన్ భావిస్తున్నట్టు సమచారం. అందులో భాగంగానే సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో బాగా అవగాహన వున్న యంగ్ ప్రొఫెషనల్స్ కోసం టాలెంట్ సెర్చ్ చేస్తున్నట్టు భోగొట్టా. ఒక‌వేళ ఇదంతా నిజ‌మే అయితే ఇప్ప‌టికే ప్ర‌చారం చేసుకోవ‌డంలో ముందుండే టీడీపీకి ఇది కచ్చితంగా అద‌న‌పు బ‌లం ల‌భించినట్టేనని పరిశీలకులు చెబుతున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp