ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ?? - Tolivelugu

ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ??

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రాచుర్యం పొందాడు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఆయనను వ్యూహకర్తగా నియమించుకుంటే సరి.. ఎన్నికలో మనం ఆశించిన రిజల్ట్ మన సొంతం అనేంతలా ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు రూపొందించి సక్సెస్ మంత్రగా మారిపోయాడు. మొన్న ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన గేమ్ ప్లాన్ సక్సెస్ అయింది. ఎన్నికల్లో వైసీపీ అనుసరించాల్సిన వ్యూహం గురించి.. ప్రత్యర్థి పార్టీకి చెక్ పెట్టేందుకు అమలు చేయాల్సిన ప్రతివ్యూహాలను అమలు చేయించి ఏపీలో వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించారు.

అలాగే దేశ రాజధాని ఢీల్లీలో అధికారం కైవసం చేసుకుందామనే బీజేపీ ప్రయత్నానికి ప్రశాంత్ కిషోర్ చెక్ పెట్టాడు. ఆప్ కు ఎన్నికల వ్యూహకర్తగా కేజ్రీవాల్ కు వెన్నుదన్నుగా ఉంటూ ఆమ్ ఆద్మీ విజయంలో కీ రోల్ పోషించారు. ఆప్ కు ప్రజా బలంతోపాటు, రాజకీయాలను మరో మలుపు తిప్పగల ప్రశాంత్ కిషోర్ పక్కనుండడంతో హస్తినలో బీజేపీ పాచికలేవి పారలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలు వినియోగించేంకునేందుకు ఆయా పార్టీలు సిద్ధం అవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో అధికారానికి చాలా ఏళ్లుగా దూరంగా ఉంటూ వస్తోన్న డీఎంకే ప్రశాంత్ కిషోర్ ను తన పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్నాయి. జేడీఎస్ కూడా ఆయనను సంప్రదించే పనిలో ఉంది.

ఎన్నికల్లో ఆయా ప్రాంతీయ పార్టీలకు వ్యూహకర్తగా ఉంటూ వస్తోన్న ప్రశాంత్ కిశోర్.. రాజకీయంగా తనదైన ముద్రేసేందుకు సిద్ధం అవుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన ఈనెల 18న కొత్త పార్టీ పెడతారని జోరుగా పొలిటికల్ సర్కిల్లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇందుకు మరింత బలం చేకూర్చుతూ ప్రశాంత్ కిషోర్ ఈనెల 18న బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించడంతో ఆయన పార్టీ పెడతారనే ప్రచారం మరింత ఊపందుకుంది. వాస్తవానికి ఈనెల 11న పార్టీ ఏర్పాటు నిర్ణయమై ఓ ప్రకటన వెలువరుస్తారని అంత అనుకున్నారు కానీ అది కాస్తా 18కి వాయిదా పడింది.

ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రమైన బీహార్ లో జేడీయూ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. నితీష్ కుమార్ కు ప్రశాంత్ కిషోర్ కు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఆయనపై పార్టీ వేటు వేసింది. దాంతో ఆయన రాజకీయ వ్యూహకర్తగా వివిధ పార్టీలకు పనిచేస్తూనే , పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp