తెలంగాణ లో బీజేపీ అధికారం కోసం కష్టపడుతోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని ప్రజల సమస్యల మీద కొట్లాడుతోంది. మరో నాలుగు సంవత్సరాల్లో జరిగే ఎన్నికల్లో కేవలం ఉత్తర భారతదేశం పైనే ఆశలు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువ..అందుకే సౌత్ ఇండియా పై అందులోను అంతో ఇంతో బలంగా ఉన్న తెలంగాణపై కన్నేశారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది బీజేపీ.
బీజేపీ నార్త్ లో పనిచేసిన ఫార్ములాను తెలంగాణలో పాటిస్తోంది. దీనికి నిదర్శనం గాంధీ సంకల్ప యాత్ర . ఇలాంటి యాత్రలు తెలంగాణలో పెద్దగా పనిచేయవన్నది విశ్లేషకుల మాట. ఒక పక్క తెలంగాణలో ఆర్టీసి ఉద్యమం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. మొదటి వారం పది రోజులు బీజేపీ గట్టిగానే ఉద్యమాన్ని నడిపించింది. కానీ ఆ తరువాత ఎందుకో సైలెంట్ అయింది. లీడర్స్ అంతా గాంధీ సంకల్ప యాత్ర అంటూ జిల్లాల్లో, ఆయా నియోజక వర్గాల్లో బిజీగా ఉన్నారు. లక్షల మంది ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్న సమ్మె పై పోరాటాన్ని వదిలేసి, ఇలాంటి సంకల్ప యాత్రల తో ఉపయోగం ఉండదని ప్రజలంటున్నారు.
కాంగ్రెస్ బలహీన పడుతుండడంతో టీఆరెఎస్ కి వ్యతిరేకంగా ఉన్న నాయకులు పజలు బీజేపీ వైపు చూస్తున్నారు.
బీజేపీ బలపడడానికి సరైన సమయం. ఈ సమయాన్ని యాత్రల పేరుతో వృధా చేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నార్త్ లో పనిచేసిన ఫార్ములాలు ఇక్కడ పనిచేయవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.