– ప్రజలను పట్టించుకోకుండా రాజకీయాలు
– ఢిల్లీ సారు బిజీ.. జాయినింగ్స్ పై ప్రతిపక్షాలు బిజీ
– నాయకుల తీరుపై ప్రజల ఆగ్రహం
– ఇవెక్కడి పాలిటిక్స్ అంటూ నిరసన స్వరం
తెలంగాణ ప్రజలు వరద కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించడం లేదు. ప్రజలకు వరద సహాయం కింద రూ. 10వేలు ఇస్తామని మొక్కుబడిగా ప్రకటన చేసిందే గానీ.. ఆ దిశగా చర్యలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సహాయం చాలా ప్రాంతాల్లో అందలేదు. వరదలు, వర్షాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజలకు సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి వెళ్లి ఢిల్లీలో తిష్ట వేశారని ప్రజలు అంటున్నారు. ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆయనకు జాతీయ రాజకీయాలు కావాల్సి వచ్చిందా అంటూ పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు సైతం వరద బాధితుల కష్టాలను పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. మరో ఏడాది తర్వాత జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచించే బిజీలో ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పనై పోయిందని, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేది తామేనంటూ బీజేపీ చెబుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏ నేతలు తమ పార్టీలోకి వస్తారు, ఎవరిని ఎలా చేర్చుకోవాలనే బిజీలో కమలం పార్టీ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీల నుంచి అసమ్మతి నేతలను చేర్చుకునే విషయంలో బిజీగా కనిపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమ పాత్రను సమర్థవంతంగా పోషించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో రాజకీయాలను పక్కన బెట్టి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పంపాలి. విపక్షాలు ప్రజల్లో మనోధైర్యం కలిగించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. కానీ.. ఇవేవి పట్టనట్టు అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.