మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయంగా వేడిగా ఉన్న ఓరుగల్లులో కొత్త కమిషనర్ గా పమెలా సత్పతి ఛార్జ్ తీసుకొని అందరి దృష్టిని ఆకర్శించారు. ఓ వైపు సమస్యల నిలయంగా ఉన్న నగరం… మరో వైపు రాజకీయ ఒత్తిళ్లతో ఆమె పాలనా ఎలా కొనసాగుతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. పాలనా విధానంలో ఎలాంటి చర్యలు చేపట్టనున్నారోనని అధికారులకు సైతం టెన్షన్ పట్టుకుంది. డ్యూటీలో జాయిన్ అయినా రోజే నగరాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమంటూ ప్రకటించింది పమెలా సత్పతి. అడుగడుగునా సమస్యల మయమైన ఓరుగల్లులో స్థానిక రాజకీయ నాయకులు.. అధికారులు పమిలా సత్పతికి సహకరిస్తారా లేదా అన్నది చర్చానీయాంశంగా మారింది.
రాణిరుద్రమదేవి పాలించిన ఓరుగల్లు గడ్డ పై మహిళా అధికారులు నిల దొక్కుకోలేక పోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గతంలో షాలిని మిశ్రా, నీతూ ప్రసాద్, స్మితా సభర్వాల్, శృతి ఓఝా, ఆమ్రపాలి ఇలా ఎందరో మహిళా అధికారులు వరంగల్ జిల్లాలో బాధ్యతలు చేపట్టారు… కానీ ఒక్క షాలిని మిశ్రా మాత్రమే రెండు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తిచేశారు. మిగిలిన వారంతా రాజకీయ ఒత్తిడులకు తట్టుకోలేక మధ్యలోనే జిల్లాను వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా వరంగల్ నగర మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న పమెలా సత్పతి కి ఇక్కడి రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. శృతి ఓఝా, వీపీ గౌతమ్, రవికుమార్ బదిలీలలో రాజకీయ నాయకుల జోక్యం కొట్టి పారేయలేని వాస్తవం. ఇక్కడ పనిచేయాలంటే రాజకీయ ఒత్తిళ్లను అధిగమించడమే పెద్ద సవాల్ …దీనికి తోడు నగర సమస్యలు…రాజకీయ నాయకులు తరచుగా విధులకు అడ్డు తగులుతుండడంతో ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.
తెలంగాణాలో రెండో అతి పెద్ద నగరమైన వరంగల్ లో లేని సమస్యంటూ లేదు. ఓరుగల్లు నగర రోడ్లను చూస్తేనే జిల్లా అభివృద్ది ఎలా ఉందో తెలుస్తుంది. పలు నివేదికల్లో జిల్లా గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతుంది కానీ ఇక్కడ తిష్ట వేసిన సమస్యలు ప్రజలను నానా కష్టాలు పెడుతుంటాయి. స్మార్ట్ సిటీ, మిషన్ భగీరథ వంటి కీలక ప్రాజెక్టులతో పాటు సీఎం ఎస్యూరెన్స్ నిధులు ఎలా వినియోగిస్తున్నారో… ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టారో జిల్లా వాసులకు అర్ధంకాని పరిస్థితి. అడపాదడపా చేప్పట్టిన పనులు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
నగర రహదారులు నరకం చూపిస్తున్నా.. పారిశుధ్యం పడకేసినా రాజకీయ నాయకులకు, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే అధికారులకు పట్టదు. ఇక చినుకు పడితే చారిత్రాత్మక నగరం చిత్తడే. నగరంలో ఉన్న డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కొద్దిపాటి వర్షం పడినా నగర వీధులన్నీ జలమయంగా మారుతాయి. 2016 సంవత్సరంలో స్మార్ట్ సిటీ ప్రకటన రాగానే వరంగల్ నగర ప్రజలు సంబర పడ్డారు. నగర అభివృద్ధి పనులు పరుగులు పెడుతుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయ్యింది. రాజకీయ ఒత్తిళ్ల కారణం ఒక వైపు… అధికారుల నిర్లక్ష్యం మరో వైపు వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ కూడా నత్తనడకనే సాగుతోంది.
ఇన్ని వత్తిళ్ల నడుమ ఓరుగల్లు రూపురేఖలు మారుస్తా అంటూ వచినా కమిషనర్ పమేలా సత్పతి వస్తూ వస్తూనే తనిఖీలతో హల్‌చల్ చేస్తున్నారు. నగరంలో ఆకస్మిక పర్యటన చేసి పారిశుధ్య పనులెలా సాగుతున్నాయి.. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ తీరుపై ఆరా తీశారు. గ్రేటర్ పరిధిలోని 40,43 డివిజన్లలో పర్యటన సందర్భంగా ఇళ్ల ఎదుట, రోడ్ల మీద చెత్త ఉండడంతో స్థానికులను మందలించారు. అలాగే, డ్రైనేజీలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకపోవడంపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లను, డిప్యూటీ కమిషనర్లను మందలించారు. ఆర్‌అండ్‌బీ భవనంలో మద్యం ఖాళీ బాటిళ్లు, చెత్త చెదారం ఉండడాన్ని గుర్తించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. దీంతో శిథిలావస్థలో ఉన్న చోట నూతన డ్రెయిన్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఇక వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని షీ–టాయిలెట్‌ను కమిషనర్ పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ఫాతిమా నగర్‌లో పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించారు. వడ్డేపల్లి బండ్ తనిఖీ సందర్భంగా పిచ్చిమొక్కలు పెరగడాన్ని గుర్తించిన కమిషనర్ కమ్యూనిటీ హెల్త ఆఫీసర్ సునీత ను ప్రశ్నించారు. తాను సెలవులో ఉన్నానని చెప్పగా.. మరొకరికి బాధ్యతలు అప్పగించాలే తప్ప పనులు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు.. ఇక మహిళా కార్పోరేటర్ భర్తలకు గట్టిగానే ఓ ఝలక్ ఇచ్చారు కమిషనర్ పమెలా సత్పతి. పాలనలో మహిళా కార్పోరేటర్ భర్తలు జోక్యం చేసుకోవద్దంటూ గట్టిగానే చెప్పారు. కార్పోరేటర్ల భర్తలకు ముందుగానే సెగ తగలడంతో వారు రాజకీయ నాయకుల వరకు వెళ్లి చెప్పుకుంటే సత్పతి ఏవిధంగా సాధిస్తుందోనని నగర వాసులు చర్చించుకుంటున్నారు. గతం లో పని చేసిన కమిషనర్లు రాజకీయ వత్తిడుల మధ్య మంత్రులకు,ఎమ్మెల్యేకు తలవొగ్గి పనిచేయలేక లాంగ్ లీవ్ లో వెళ్లిన సందర్భాలున్నాయి. లీవ్ లో వెళ్లిన కమిషనర్లు తిరిగి రాకపోవడం కూడా ఓరుగల్లు జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది.
ఇన్ని సమస్యల సుడిగుండాలని, రాజకీయ ఒత్తిళ్ల ను ఎదుర్కొని ముందుకు సాగుతూ పోరుగడ్డ ఓరుగల్లు నగర రూపురేఖలు మార్చి పమెలా సత్పతి ప్రజల మెప్పును పొందుతారో లేదో వేచిచూడాలి మరి!