కడప జిల్లా రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. అది ఎన్నికల ముందయినా …తరువాతయినా అలాగే ఉంటుంది. సీఎం సొంత జిల్లా కావడంతో ఇప్పుడు అధికారపార్టీ లోనే ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తమ పెత్తనమే సాగాలన్న ఆశ ప్రతి నాయకుడిలోనూ కనిపిస్తోంది. ఇప్పుడు అదే వైసీపీకి సమస్యగా మారింది. వచ్చిన పదవులు, స్థాయిని బట్టి కాకుండా మరికొంత మంది నాయకులు షాడో పాలిటిక్స్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కడప జిల్లా వైయస్ కుటుంబానికి కంచుకోట. దశాబ్దాల కాలం నుంచి ఆ కుటుంబానికి జిల్లా రాజకీయాల్లో పట్టుంది. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అది ఇంకా పెరిగింది. దానిని బట్టి నాయకులు కూడా పెరిగారు. గత ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ స్థానాలు వైసీపీనే గెలిచింది. దీంతో జిల్లా నుంచి ఎవరికి ఏ పదవి ఇవ్వాల్లో అర్థం కాక జగన్ కొద్దిరోజులు డైలమాలో పడ్డారు. తరువాత తెరపైకి వచ్చిన రిజర్వేషన్ల ప్రక్రియలో మైనార్టీ కోటాలో అంజద్ బాషాకు మంత్రి పదవితో పాటు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. దీంతో జిల్లా బిగ్ బాస్ అంజద్ బాషానే అనుకున్నారు అందరూ. కానీ రాను రాను ఆయనను లెక్కచేసేవారు లేకుండా పోయారు. తనకంటే సీనియర్ ఎమ్మెల్యేలు, రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండడంతో వారంతా తమ హవా చూపించడం మొదలుపెట్టారు. దీంతో అధికారులు కూడా గందరగోళంలో పడ్డారు. ఎవరు చెప్పినట్లు నడుచుకోవాలో అర్ధం కాని అయోమయ పరిస్థితి. కొద్ది రోజులు జగన్ తమ్ముడు వైయస్ అవినాస్ చెప్పినట్లు జిల్లాలో పనులు జరిగేవి. చివరికి పంచాయితీ జగన్ దగ్గరుకు పోవడంతో జిల్లా ఎమ్మెల్యేలకు బాగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఎవరి నియోజకవర్గంలో వారు పని చేసుకోవాలని, ఒకరి పనిలో ఒకరు వేలు పెట్టవద్దంటూ గట్టిగానే చెప్పారంట సీఎం జగన్. ఎవరి నియోజకవర్గాల్లో సమస్యలు, అబివృద్ది వారే చూసుకోవాలని చెప్పారంట. ఇక జిల్లాకు సంబంధించిన ఉమ్మడి ప్రయోజనాలు, ప్రాజెక్టు విషయంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి చూసుకుంటారని చెప్పారంట. పైనల్ గా తనే
కడప జిల్లా వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటానని జగన్ చెప్పకనే చెప్పడంతో అందరూ స్పీడ్ తగ్గించారు. ఇప్పటికైతే ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ మీటింగ్ ల్లో అభివృద్ది కార్యక్రమాల్లో మాత్రం అక్కడక్కడా ఇగో పీలింగ్స్ బయటపడుతూనే ఉన్నాయి.