తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పునః నిర్మించిన యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తుల రాకతో శోభాయమానంగా వెలిగిపోతోంది స్వామివారి ఆలయం. అయితే.. తెలంగాణకే తలమానికంగా నిర్మించిన ఆలయంపై ట్విట్టర్ వేదికగా చర్చ జరగుతోంది. ఇప్పుడు ఆ చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీని ఉద్దేశిస్తూ ” లేస్తే హిందుత్వం, హిందుత్వం అని మాట్లాడే పువ్వులకు తెలంగాణలో కట్టిన యాదాద్రి గుడి మాత్రం కనపడదు..! యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు హిందూ దేవుడు కాదా లేక బీజేపీకి దేవుడు కాదా?. బీజేపీది దేవుడి పైన భక్తి కాదు, కేవలం రాజకీయం పైన భక్తి ! గుజరాత్ చిలుకా ఏం పలకలేదేమో.!” అంటూ చేసిన ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ పై బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఇతర నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ” మాకు రాముడైన, నరసింహుడైన, విష్ణుమూర్తి స్వరూపాలే.. శ్రీ రామమందిర నిర్మాణాన్ని రాజకీయం చేసింది మీరు. యాదాద్రిని ప్రజల సొమ్ముతోనే కదా నిర్మించింది.. అప్పుడు మా అందరి దేవుడే కదా.. మీ బాధ ఏంది అసలు..?” అంటూ ట్విట్టర్ లో కౌంటర్ ఇస్తున్నారు.
యాద్రాద్రి ఆలయం రాష్ట్రంలోని ప్రజాధనంతో కట్టిందే కదా.. ఇది ప్రజలందరి ఆలయం అంటూ రీట్వీట్లు చేస్తున్నారు. అయితే.. ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవుని పేరుతో కూడా రాజకీయం చేస్తున్నారా అంటు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.