మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు రాజకీయ వేదింపులే కారణమా ? కేసులు కోడెలను అత్మక్షోభకు గురిచేశాయా? వైసీపీ అధికారంలోకి వచ్చాక పెట్టిన అసెంబ్లీ ఫర్నీచర్ కేసు దీనికి ఒక కారణమా? వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజులకు ఫర్నీచర్ తన వద్ద ఉందని, తీసుకెళ్లాలని కోడెల కోరినా ఫర్నీచర్ దొంగిలించారన్న ప్రచారం చేయడమే కాకుండా కేసు నమోదు చేయడమూ కారణమా? ప్రజా సేవలో పరిణతి చెందిన నాయకుడు రాజకీయ కక్షసాదిపులకు బలికావడం దారుణమని ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ద్వారా ఈ ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి. సమాజంలో ఇలాంటి పెడ ధోరణి క్షేమం కాదని, కోడెల కుటుంబానికి సానుబూతి తెలుపుతూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
కోడెలపై ఫర్నీచర్ కేసుతోపాటు కుటుంబ సభ్యులపై నమోదైన మొత్తం 15 కేసులు కూడా ఆయనను తీవ్ర మనోవేదనకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీనిపై రేవంత్ ట్వీట్ కు అనుకూల, వ్యతిరేక ట్వీట్లు వచ్చాయి. తలవంచాల్సి వస్తే తల తుంచుకుంటాం..కానీ వంచం, పల్నాడు నేర్పింది ఇదే!! అంటూ ఓ నెటిజన్ ట్వీట్ వచ్చింది. చాలా మంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
కొమ్ములు తిరిగిన కేసీఆర్ ను ఎదిరించిన రేవంత్ గారు.. ఇలా బేలగా ట్వీట్ చేస్తారా? అంతో ఓ నెటిజన్ ప్రశ్నించాడు. మీ మాజీ బాస్ బాబు, కేంద్ర ప్రభుత్వ పెద్దలంతా కలిసి ఆడిన కీచక పర్వంలో జగన్ కుటుంబం ఎంత విలవిలలాడిందో అంటూ ఆ ట్వీట్ లో ప్రస్తావించాడు. చిన్న పిల్లాడ..! మనస్తాపంతో చనిపోవడానికి? అంటూ మరో ట్వీట్ వచ్చింది. చేసిన పాపాలు ఊరికే పోతాయా? అంటూ మరో ట్వీట్ ! ఆత్మహత్య చేసుకుంటే తప్పులు ఒప్పులు కావు, నిజమైన నాయకుడు ప్రభుత్వ తప్పులు నిరూపిస్తాడు..అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. రంగాను చంపిన, చంపించిన ప్రతి దుర్మార్గుడు కుక్క చావు చచ్చాడు..దేవుడు చూస్తుంటాడు..అంటూ మరో ట్వీట్ వచ్చింది.