దేశంలో ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అయ్యాయి. ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఒకే దేశలో పోలింగ్ పూర్తి కానుండగా.. యూపీలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని 55 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఎన్నికల అధికారి వెల్లడించారు.
ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ బరిలో 632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 82,38,187 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇక.. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒక్క విడతలోనే పోలింగ్ పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటల పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. గోవా ఎన్నికల బరిలో 301 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 11,56,564 మంది ఓటర్లు ఉండగా… 1,722 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కాగా.. ఓట్ల లెక్కింపు, ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. ఎలాంటి అవాంతరాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల పోలింగ్ జరుపుతున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.