ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొదట మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రానికి స్పీడందుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 54.02 శాతం పోలింగ్ నమోదైంది. 2015 ఎన్నికల్లో 63.5 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ పదే పదే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తయ్యాయి.
సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిజల్స్ట్ వెలువడనున్నాయి. ఆరున్నర లోపు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తారో…కాంగ్రెస్, బీజేపీలు తిరిగి అధికారాన్ని చేజిక్కుంచుకుంటాయో ఈనెల 11న జరిగే కౌంటింగ్ లో తేలుతుంది.