ఏపీ మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గురువారం తెల్లవారుజామున 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆత్మకూరు నియోజకవర్గ స్థానంనుండి మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లకు గానూ.. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇందులో భాగంగా 1,339 మంది జనరల్, 1032 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. అంతే కాకుండా 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్ ఆఫీసర్స్ కూడా విధుల్లో ఉంటారు. మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు అదికారులు.
సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ కు పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 148 సాధారణ పోలింగ్ కేంద్రాలు కాగా.. 131 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు.
అంతేకాకుండా.. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. కోవిడ్ ప్రోటోకాల్ తోపాటు.. మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. 78 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల విధుల్లో 1,409 పోలింగ్ సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.