తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్నదన్న విషయాన్ని తాజా నివేదిక వెల్లడించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 ప్రకారం గతేడాదితో పోలిస్తే 2021లో హైదరాబాద్‌లో కాలుష్య స్థాయి పెరిగింది.
ప్రపంచంలోని వంద అత్యంత కాలుష్య నగరాల్లో 60కి పైగా భారత్‌లోనే ఉన్నట్లు సదరు నివేదిక చెప్తోంది. దేశంలోని ఆరు అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా..ఆ తర్వాత కోల్‌కత్తా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చైన్నై ఉన్నాయి.
భారతదేశంలోని నగరాలేవీ కూడా గాలి నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 ప్రకారం..హైదరాబాద్‌లో పార్టికల్ మ్యాటర్ పొల్యూషన్ 2.5 స్థాయిలు దాటి పెరిగాయి. 2020లో 34.7 నుంచి 2021 లో 39.4 కి పెరిగాయి.
సిటీలో రోజురోజుకూ వెహికల్స్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దాంతో కాలుష్య స్థాయి ఇంకా పెరుగుతున్నది. కొవిడ్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్ కాలంలో వ్యక్తిగత వాహనాలపైన జనాలు దృష్టి పెట్టారు. అలా వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. హైదరాబాద్ పాపులేషన్‌లో 90 శాతం మందికి ఓన్ వెహికల్స్ ఉన్నాయని ఐక్యూ నివేదిక తెలిపింది.