– రేగొండలో రెచ్చిపోతున్న కబ్జాదారులు
– అధికారపార్టీ అండదండలతో చెరువు కబ్జా
హైదరాబాద్ లో చిన్నపాటి ల్యాండ్ కూడా కోట్లలో పలుకుతుంటుంది. అలాగే కబ్జాల కథలు కూడా చాలానే ఉంటాయి. అయితే.. జిల్లాల్లోనూ కబ్జాలకు కొదవేం ఉండడం లేదు. అధికారపార్టీ నేతల అండదండలతో కాబ్జాదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా భూపాలపల్లి జిల్లా రేగొండలో చెరువు కబ్జా విషయం వెలుగులోకి వచ్చింది.
మండల కేంద్రంలోని తౌట కుంట సర్వే నెంబర్ 498లో 27.39 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది జాతీయ రహదారి 373కి ఆనుకొని ఉంటుంది. దీంతో కొంతమంది అధికార పార్టీ నేతల కన్ను ఈ చెరువుపై పడింది. అనుకున్నదే అదునుగా స్థానిక అధికార పార్టీ నాయకులు.. అధికారుల అండదండలతో ఎవరికీ అనుమానం రాకుండా బ్రిక్స్ కంపెనీ పేరుతో పక్క సర్వే నెంబర్ లో లీజ్ కు తీసుకున్నారు. దానికి ఆనుకొని ఉన్న చెరువు కబ్జాకు ప్లాన్ చేశారు.
కబ్జాదారుల వెనుక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కూడా ఉన్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు కబ్జాదారులకు సహాయం చేయడం పట్ల మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో భూమి ధర లక్షల రేట్లు పలుకుతుందన్న ఆశతో కబ్జాకు పాల్పడిన వారిపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కబ్జాదారులకు సహకరిస్తున్న స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులపై కూడా వేటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మరి.. ఇది ఎటుదారి తీస్తుందో చూడాలి.