తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా కొనసాగుతున్నాయి. భోగభాగ్యాల భోగికి మంటలతో ప్రజలు స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భోగిమంటలు వేశారు. కోలాటాలు ఆడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వాడవాడలా భోగి మంటలు వేసి చిన్నాపెద్దా సందడి చేశారు.
ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందించాలని కోరుకున్నారు. అలాగే అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థించారు.
చెన్నైలోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలసి సంబరాలు చేసుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. సంక్రాంతి పండుగ మన సంప్రదాయానికి ప్రతిబింబిస్తుందన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలు, రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్న సీఎం.. ప్రజలు సిరి సంపదలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు.
తాడేపల్లిలోని తన నివాసంలో ఏపీ సీఎం జగన్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు ఆయన హాజరయ్యారు. గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన భార్య కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఇలా అందరూ భోగి మంటలు వేశారు. వాడవాడలా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా కొనసాగుతున్నాయి.