మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. మొన్నటి దాకా తనను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించారని ఆయన అన్నారు. వారి గెలుపు కోసం తనను ప్రాధేయపడ్డారని అన్నారు.
పొంగులేటి వర్గానికి చెందిన 20 మంది నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాళ్లను వీళ్లను కాదు, దమ్ముంటే తనపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన సవాల్ చేశారు. బీఆర్ఎస్ నేతలు వాళ్ల కార్యక్రమాల కోసం గతంలో తనను పిలిచారన్నారు. అలా పిలిచినప్పుడు తన సభ్యత్వం గురించి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
డిసెంబర్ దాకా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో తన బొమ్మ ఎందుకు వేశారని ఆయన ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మార్పు అని ఆయన స్పష్టం చేశారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.
పార్టీ తనకు అన్యాయం చేసిందని ఆయన బహిరంగంగానే మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్‌ను వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా బీఆర్ఎస్ పై ఆయన ఇటీవల విమర్శలు చేస్తున్నారు. దీంతో అభిమానులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి పార్టీ మార్పుపై వారితో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన నేతలపై వేటు వేసింది.