వైఎస్సాఆర్‌టీపీలో చేరతారన్న వార్తలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. తాను వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ కాలేదని ఆయన వెల్లడించారు. తాను షర్మిలను కలిశానన్న వార్తలు అవాస్తవమని అన్నారు.
గతేడాది జూలైలో తాను వైఎస్ షర్మిలను కలిశానని చెప్పారు. అప్పుడు తన కూతురు వివాహ శుభలేఖను ఇచ్చేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె దగ్గరకు వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. దీంతో వైఎస్ఆర్ టీపీలో పొంగులేటి చేరే విషయంపై క్లారిటీ వచ్చింది.
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం నడుస్తోంది.
ప్రభుత్వంపై పొంగులేటి తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆయన ఫోకస్ చేశాయి. పొంగలేటిని పార్టీలో చేర్చుకుంటే రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పార్టీకి ప్లస్ అవుతుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఎలాగైనా పొంగులేటిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నాయి.