– పొంగులేటి ఆత్మీయ సమావేశాలు
– పినపాకలో తొలి మీటింగ్
– బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారని ప్రచారం
– కేసీఆర్ సభ నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు
– జిల్లా నేతల భేటీలో అన్నింటిపై క్లారిటీ ఇచ్చిన సీఎం
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని కేసీఆర్ నమ్మకంతో ఉన్నారు. జాతీయ రాజకీయాల నేపథ్యంలో అటు ఏపీ, ఛత్తీస్ గఢ్, ఇటు ఖమ్మం టార్గెట్ గానే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు. అయితే.. సోమవారం జరిగిన ఖమ్మం జిల్లా నేతల సమావేశంలో పార్టీని వీడే వారిని వీడనివ్వండి.. ఉన్నవారిని కాపాడుకుంటామంటూ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.
కేసీఆర్ ఇలా మాట్లాడటానికి కారణం లేకపోలేదు. మాజీ ఎంపీ పొంగులేటి చర్యలు అనుమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇలా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. 2014లో ఖమ్మం లోక్ సభ సీటులో గెలిచారు పొంగులేటి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ పూర్వ వైభవం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని పొంగులేటి నిర్ణయించారు. మంగళవారం పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొదటి సమ్మేళనానికి ఏర్పాట్లు చేశారు. పొంగులేటి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. పైగా బీఆర్ఎస్ జెండాలు, కలర్, ఫ్లెక్సీలు లేకుండా ఆయన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అధిష్టానంపై అసంతృప్తిలో ఉన్న ఈయన.. తన వెంట ఉన్న ఏడుగురు నాయకులకు టికెట్లు ఇప్పిస్తానని ఈమధ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఖమ్మం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో ఉంటే.. అందరికీ టికెట్లు కష్టమే. అంటే బీజేపీలో చేరి అది కార్యరూపం దాల్చేలా చేయాలని చూస్తున్నట్లుగా అనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే అమిత్ షా తో భేటీకి ముహూర్తం పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి.