ప్రజలను హిప్నటిజం చేయడంలో సీఎం కేసీఆర్ దిట్టా అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
పొంగులేటి ఆదివారంనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కీలకంగా వ్యవహరించాయన్నారు. కానీ ఈ రెండు పార్టీలను కాదని టీఆర్ఎస్ ను రెండు దఫాలు ప్రజలు రాష్ట్రంలో గెలిపించినట్టుగా చెప్పారు.
రాష్ట్ర ప్రజల ఆాకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన చేస్తాడని భావించి ప్రజలు టీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగిస్తున్నాడని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఆయన విమర్శించాడు. రూ. 5 లక్షల కోట్లు కేసీఆర్ అప్పులు చేశాడని పొంగులేటి చెప్పారు.