-ఓపెన్ వార్ కి దిగిన పొంగులేటి
-ఏకంగా కేసీఆర్ పైనే కౌంటర్లు
-స్వపక్షంలో విపక్షంలా సీన్
-పొంగులేటి పై విరుచుకుపడుతున్న బీఆర్ఎస్ నేతలు
– కౌంటర్ వార్ తో హీటెక్కిన ఖమ్మం పాలిటిక్స్
సొంత పార్టీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్ ఓపెన్ అవుతోంది. ఇన్నాళ్లు ఇన్ డైరెక్ట్ గా తన అసంతృప్తిని వ్యక్త పరిచే ప్రయత్నం చేశారు ఆయన. అయితే రాజకీయ ప్రస్తానంలో ఆయనతో పాటే అడుగులు వేసుకుంటూ వచ్చిన రేగా కాంతారావు ఇంకా హరిప్రియలు బహిరంగంగా ఆయన పై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. దీంతో ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకని నిర్ణయించుకున్న పొంగులేటి ఇక డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ తో తెగతెంపుల దిశగా సాగుతున్న ఆయన కౌంటర్ వార్ కు దిగుతున్నారు. జిల్లా ముఖ్య నాయకులంతా పొంగులేటిపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి మరింతగా పెరిగింది. మరో వైపు బీఆర్ఎస్ తో అంతకంతకూ దూరం పెరుగుతున్న వేళ నియోజక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తన తదుపరి రాజకీయ అడుగులపై వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో బీఆర్ఎస్ లో తనకు గౌరవం దక్కలేదని,ఇబ్బందులు పడ్డానని కార్యకర్తలకు,అనుచరులకు వివరించారు.
సోమవారం బోనకల్లులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే విమర్శలు సంధించారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. ఇదే సమయంలో పార్టీలో తనపై జరిగిన కుట్రలు,అవమానాలను ఏకరవు పెట్టారు. కేసీఆర్ పై పొంగులేటి నేరుగా విమర్శలు చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు సైతం ప్రతిదాడికి దిగారు.
ఇక ఇలా ఉంటే ఖమ్మం జిల్లా ముఖ్యనేతలంతా సమావేశమై శ్రీనివాస్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. గతంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రిని పొంగులేటి కీర్తించిన వీడీయోలు ప్రదర్శించారు. పొంగులేటి బీఆర్ఎస్ లో లేరనే తాము భావిస్తున్నట్లు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు. తన స్థాయిని ఎక్కువగా ఊహించుకుని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని,వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
జిల్లా ముఖ్యనేతలంతా మాజీ ఎంపీ కుట్రలు తెలుసుకొని కలిసికట్టుగా పనిచేయడం వల్లే అన్ని ఎన్నికల్లో పార్టీకి విజయం దక్కిందని తాత మధు స్పష్టం చేశారు. స్వపక్షంలోనే విపక్షంలా మారి పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలను పొంగులేటి తీవ్రతరం చేయటం అందుకు బీఆర్ఎస్ నేతలు సైతం దీటుగా బదులిస్తుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
రాష్ట్రంలో రైతులకు 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎవరికైనా 24 గంటలు ఉచితంగా వస్తుందా? ఖమ్మంలో చాలా వరకు పూరి గుడిసెలు కనిపిస్తున్నాయి. ఇంకెప్పుడు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూరం ఇస్తారు..ఇప్పటికి ఎంత మందికి రుణమాఫీ చేశారు.. ఇంకా మనం ఇచ్చిన హామీలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో వాగ్దానాలు చేయడమేనా.. హామీలు అమలు పరిచేది ఉందా అని నేను ముఖ్యమంత్రి కేసీఆర్ ని అడుగుతున్నాను..అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
మొత్తానికి ఖమ్మం రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. స్వపక్షంలోనే విపక్షం పాత్ర పోషిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.