వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మోసం జరుగుతున్నా టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరిట మోసాలు జరుగుతున్నాయని, రైతులు దీనావస్థలో ఉన్నారని చెప్పారు. రైతులకు మద్దతు ధర లభించడం లేదని, ఎండలో కూడా మిషన్‌లలో తేమ 18 శాతం చూపిస్తున్నదని ఆరోపించారు.
రైతులకు కొనుగోలు కేంద్రాల్లో మోసం జరుగుతున్నా ఆ విషయాలను టీఆర్ఎస్ సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఈ విషయాలపై సమీక్ష చేయాలన్నారు. అసలు సమీక్ష ఆలోచనే తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఫైర్ అయ్యారు.
మోడీ హైదరాబాద్ ఐఎస్‌బీ టూర్‌పైన కూడా లక్ష్మయ్య స్పందించారు. ఐఎస్‌బీకి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. టాప్ ఐదు ఇన్ స్టిట్యూషన్స్‌లో ఒకటిగా ఐఎస్‌బీ ఉందని తెలిపారు.
హైదరాబాద్ ఐఎస్‌బీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని, కానీ, అక్కడకు వచ్చిన తర్వాత విద్యార్థులకు ఏం చెప్తాడని ప్రశ్నించారు. తన పాలనా కాలంలో తెచ్చిన సంస్కరణలు ఏంటని అడిగారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతాంగ పరిస్థితి అక్కర్లేదని, రాజకీయాల కోసమే పంజాబ్ రైతులకు సాయం చేశాడని విమర్శించారు.