కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ ను జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఆయన విమర్శలు చేశారు. వాటిపై కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. కాళేశ్వరం వల్ల ఇప్పటి వరకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. ఫిబ్రవరి నుంచి కాళేశ్వరం వద్ద ఎన్ని నీళ్లు ఉంటాయో చర్చకు సిద్ధమా అని కేసీఆర్ కు సవాల్ చేశారు.
చుక్కనీరు కూడా కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ కు రాలేదన్నారు పొన్నాల. కేసీఆర్ అన్నీ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. 50 టీఎంసీలకు 10 టీఎంసీలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని.. ఆ నీళ్లు ఎక్కడివని ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి గోదావరి నుంచి ఎల్లంపల్లికి వచ్చాయని తెలిపారు. ఎన్ని నీళ్లున్నా అవన్నీ ఎల్లంపల్లివేనని తెలిపారు. ఈ వాస్తవాలన్నీ ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేశామనే ఇప్పటి వరకు జాతికి అంకితం చేయ లేదని విమర్శించారు పొన్నాల. భూ నిర్వాసితులకు న్యాయం చేసేటట్లయితే.. 2013 చట్టానికి ఎందుకు తూట్లు పొడిచారని కేసీఆర్ ను నిలదీశారు. అయినా.. మైదాన ప్రాంతంలో కట్టిన రిజర్వాయర్ కు భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లితే.. జరిగే నష్టం ఊహించలేమని.. కేసీఆర్ కు ఆమాత్రం తెలియదా? అంటూ మండిపడ్డారు.
మల్లన్నసాగర్ ను కేసీఆర్ అంకితం చేసింది జాతికి కాదన్న పొన్నాల.. కల్వకుంట్ల కుటుంబానికని విమర్శించారు. ఒక టూరిజం స్పాట్ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారని.. సాంకేతికంగా ఎత్తిపోతల పథకాల రిజర్వాయర్ల కెపాసిటీ తక్కువగా ఉంటుందని చెప్పారు. కానీ.. మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో సాంకేతికతకు తిలోదకాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు లేకపోతే కోర్టులలో కేసులు ఎందుకుపడ్డాయని.. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.