రాష్ట్ర సీఎంగా ఉంటూ రాజ్యాంగాన్ని మార్చాలి.. కొత్త రాజ్యాంగం కావాలి అనడం రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ను అవమానించడమే అన్నారు కాంగ్రెస్ నేత పొన్నాల లక్షమయ్య. ఏ మత్తులో ఉండి రాజ్యాంగాన్ని అవమానించేలా మాటలు మాట్లాడాడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాలలో 105 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు. నీకు ఏ విషయంలో అయితే సవరణ అవసరమో ఆ విషయంలో చర్చ పెట్టి.. రాష్ట్రపతి, పార్లమెంట్ తో చర్చించాలి అంతే కానీ.. రాజ్యాంగాన్ని మార్చాలి అనడం అవివేకం అని వ్యాఖ్యానించారు.
ఇదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు సీఎం అయ్యారనే విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగిందనేది గుర్తులేదా కేసీఆర్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు పొన్నాల. చెప్పిన మాటలకు, చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదు అని ఆరోపించారు. అసలు కేసీఆర్ మాట్లాడుతున్న భాష ఏంటో కూడా అర్ధం కావడం లేదన్నారు. ఓ రాష్ట్ర సీఎంగా ఉంటూ మంత్రులను పక్కన కూర్చోబెట్టుకుని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని చేపట్టిన వ్యక్తి.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాటాడ్డం దొరపోకడకు ధోరణి పడుతోందన్నారు.
80 వేల పుస్తకాలు చదిన నీకు రాజ్యాంగాన్ని చదవాలనిపించలేదా కేసీఆర్ అని నిలదీశారు పొన్నాల. మీరు అన్ని చట్టాలలో రాజ్యాంగ సవరణకు మద్దతు ఇచ్చారు కదా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై దేశమంతా స్పందిస్తుంటే మీరెందుకు వ్యతిరేఖిస్తున్నారో అర్ధంకావట్లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేఖిస్తూ రెండు గంటలపాటు మీరు మాట్లాడే అర్హతను కూడా మీరు అవమానించిన రాజ్యాంగం కారణంగానే వచ్చిందనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు.
మీరు ఎన్నిక ముందు ఇచ్చిన ఎన్ని హామీలను నేరవేర్చారో చెప్పాలని నిలదీశారు. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నావు కదా.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సంగతి మరిచినవా అంటూ ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ వంటి హామీల సంగతేంటి అని నిలదీశారు. జీఎస్టీ, నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికింది మీరు కాదా అని ప్రశ్నించారు పొన్నాల.