వందే భారత్ రైలు టికెట్ ధరలు సామాన్య ప్రయాణికులకు అందుబాటులో లేవని.. అది ధనికులకు ఉపయోగపడే విధంగా ఉందని విమర్శించారు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. పండుగపూట రాజకీయాలు మాట్లాడకూడదనుకున్నప్పటికీ మాట్లాడక తప్పడం లేదన్నారు.
సికింద్రాబాద్-విశాఖ మధ్య ఆదివారం ప్రధాని మోడీ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. దీనిపై ఎందుకంత ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. దేశ ప్రధాని, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్ అందరూ ఒక రైలు గురించి విస్తృత ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు.
వందే భారత్ 18వది అవుతుందని అన్నారు. మోడీ ప్రారంభించిన వందే భారత్ రైలులో ధరలు సామాన్య ప్రజలకు అందనంత ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు.
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఉన్నవాటికి కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్ప ప్రజోపయోగ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదన్నారు పొన్నాల లక్ష్మయ్య.