ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ ను మించిన నాటకీయ ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదని అన్నారు పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. ప్రజల ముందుకు రావడానికి జంకుతున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా..? అంటే అది కేసీఆర్ ఒక్కరే అని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియాతో చర్చించని ఏకైక సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇంత రాద్ధాంతం చేసినా కేబినెట్ సమావేశం మాత్రం ఏర్పాటు చేయలేదని అన్నారు. నిన్న మొన్నటి వరకు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ధాన్యాన్ని రైతుల దగ్గర కొనాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా.. అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం ఎందుకు అయిందో చెప్పాలని నిలదీశారు. ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు పొన్నాల.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. ఎంత పంట పడింది.. ఎంత సేకరించారు.. ఎన్ని రోజుల్లో సేకరించారు.. అనేది అధికారికంగా లెక్కలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ సమావేశాలు మీ సొంత విషయాలు మాట్లాడుకోవడానికా కేసీఆర్..? అని వ్యాఖ్యానించారు పొన్నాల. మంత్రి మండలి సమావేశంలో పంట నష్టంపై రైతులను కలవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్టు ప్రకటించిన సీఎం.. ఎందుకు వాయిదా వేసుకున్నట్టు అని నిలదీశారు. రైతుల ముందుకు రావడానికి మొహం లేక ఏవో కారణాలు చెప్పి తప్పించుకున్నారని అన్నారు.
సోమవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల 317 జీవో, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల విషయంపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించకుండా రైతు చావులకు కారణమవుతున్నారని.. వారి కుటుంబాల ఉసురు తాకుతుందని అన్నారు పొన్నాల. ఏడు సంవత్సరాల తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల అంశంపైన కేబినెట్ లో చర్చించడం హాస్యంగా ఉందన్నారు. ఏడున్నర సంవత్సరాలు దోపిడీ చేసిన తర్వాత ఇప్పుడు చర్చించడం ఎవరిని మోసం చేయడానికి అని ఎద్దేవా చేశారు. 7280 కోట్ల తోటి మన ఊరు మన బడి అనే నినాదంపై కొత్త చట్టం తీసుకొస్తాననటం సిగ్గుచేటన్నారు.
డబుల్ బెడ్ రూమ్, మూడెకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. వివిధ పథకాల కింద 9061 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాస్తవం కాదా..? దీనిమీద సమీక్షలు ఉండకూడదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పాఠశాలలను బాగుచేయడానికి అని చెప్పి మన ఊరు మన బడి పేరుతో కొత్త డ్రామాకి తెర లేపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద వచ్చే 1423 కోట్ల రూపాయలు ఏమయ్యాయని అడిగారు. థర్డ్ ఫ్రంట్ అంటూ దొంగతనంగా అఖిలేష్ యాదవ్ ని కేసీఆర్ పిలిపించుకున్నారని ఆరోపించారు. నాటకాలన్నీ కట్టిపెట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి పెట్టు కేసీఆర్.. అని వ్యంగ్యంగా మాట్లాడారు పొన్నాల.