బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ హైదరాబాద్ పర్యటనపై కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ కు దిగింది. సంతోష్ పర్యటనపై ఆ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు.
ఆయన గురువారం ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. సంతోష్ సొంత పార్టీ పటిష్టత కోసం వస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ ఆయన ఇక్కడికి వచ్చి పార్టీ ఫిరాయంపుల కమిటీ ఛైర్మన్ తో భేటీ కావడం, కాంగ్రెస్ నేతలను ఎలా బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి పట్టుమని 20 మంది అభ్యర్థులు లేరని గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదన్నారు.
తెలంగాణ ప్రజలను ఆకర్షించాలనుకుంటే కేంద్రం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల మన్నన పొందాలే తప్ప ఇతర పార్టీలోని నాయకత్వాన్ని తమ పార్టీలో చేర్చుకుని అధికారంలోకి వస్తామనంటే అది కలగానే మిగిలిపోతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజామోదం పొందాలంటే ఇలాంటి సమావేశాలతో బీజేపీకి ఎలాంటి ఉపయోగం లేదని బీఎల్ సంతోష్ కు సూచించారు పొన్నం ప్రభాకర్.
తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులును బీజేపీలో చేర్చుకొని అధికారంలోకి వస్తామని భావిస్తే.. అది భ్రమే అవుతుందన్నారు. తెలంగాణను అవమానించిన ప్రధాని మోడీ, ఇంకా అమిత్ షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను చెప్పింది అర్థం కాకుంటే తెలుగులోని సందేశాన్ని తర్జుమా చేసుకొని అర్థం చేసుకోవాలన్నారు.